వైసీపీకి 'ప్రధాన ప్రతిపక్షం'- వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?
సభా కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఉంటుందే తప్ప.. మాట్లాడేందుకు కానీ.. సభలో పైచేయిసాధించేందుకు కానీ.. వైసీపీకి అవకాశం లేదు.
వైసీపీ అధినేత జగన్‌కు తాజా ఎన్నికల్లో ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. స్పీకర్‌కు లేఖ రాసినా.. ప్రభుత్వాన్ని కోరినా.. స్పందించ లేదు. దీంతో ఏకంగా సభకు కూడా డుమ్మా కొట్టేశారు. గత నెలలో సభ సమావేశ మైనప్పుడు.. నేరుగా వెళ్లిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి బయటకు వచ్చేశారు. తర్వాత రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిసి కూడా.. సభకు వెళ్ల లేదు.
ఇక, తాజాగా ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లోనూ.. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి వెళ్లినా.. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టడంలో కూటమి సర్కారు విఫలమైందని పేర్కొం టూ.. నినాదాలతో సభను దద్దరిల్లేలా చేసి.. ఆ వెంటనే మళ్లీ బయటకు వచ్చేశారు. మరిసటి రోజు తాడేపల్లిలోనే ఉన్నా.. సభ వంక కూడా చూడలేదు. నిజానికి రెండో రోజు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో జగన్ ఉండి ఉంటే.. మాట్లాడే అవకాశం దక్కి ఉండేది.
కానీ, ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లిపోయి.. అక్కడ ధర్నాచేయడం ప్రారంభించారు. ఈలోగా హైకోర్టులో ప్రదాన ప్రతిపక్షం హోదా ఇప్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేయాల్సి ఉంది. అయితే.. ఇక్కడే కీలకమైన సందేహాలు తెరమీదికి వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే.. వైసీపీ లాభమేంటి? లేకపోతే నష్టమేంటి? అనేది సందేహాలు.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నా.. స్పీకర్ నిర్ణయం మేరకే.. మాట్లాడేందుకు సభలో వైసీపీకి మైకు లభిస్తుంది తప్ప.. తాము కోరుకున్నట్టుగా అయితే.. మైకు రాదు.
గతంలో చంద్రబాబు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. సో.. హోదా ఉన్నా.. లేకపోయినా.. కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడితే.. మైకు లభిస్తుంది. కాబట్టి.. దీనికి హోదాతో పనిలేదు. ఇక, హోదా ఉంటే.. ఒనగూరే ఏకైక ప్రయోజనం.. మంత్రితో సమానమైన జీతం లభిస్తుంది. అదేవిధంగా ప్రొటోకాల్ లభిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లభిస్తుంది. లేదా.. సభా కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఉంటుందే తప్ప.. మాట్లాడేందుకు కానీ.. సభలో పైచేయిసాధించేందుకు కానీ.. వైసీపీకి అవకాశం లేదు.