మండే రెండో జాబితా...వైసీపీలో టెన్షన్....!

ఇపుడు రెండవ జాబితా మీద వాడిగా వేడిగా కరసత్తు సాగుతోంది అని అంటున్నారు. రెండవ జాబితా ఈ మండే రిలీజ్ చేస్తారు అని అంటున్నారు.

Update: 2023-12-17 00:30 GMT

వైసీపీ పదకొండు మందితో విడుదల చేసిన తొలి జాబిత రాజకీయంగా ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగింది. చాలా మంది ఎమ్మెల్యేలకు ప్లేస్ మారింది. కొందరికి టికెట్ దక్కలేదు. వైసీపీతో పాటు టీడీపీలో కూడా ఇది పెద్ద చర్చకు దారి తీసింది.

ఇపుడు రెండవ జాబితా మీద వాడిగా వేడిగా కరసత్తు సాగుతోంది అని అంటున్నారు. రెండవ జాబితా ఈ మండే రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. మరి అందులో ఎంతమంది పేర్లు ఉంటాయో అన్న టెన్షన్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉంది అంటున్నారు. ఇక ఎవరికి టికెట్లు దక్కుతాయో ఎవరికి దక్కవో అని కూడా అంతా మధన పడుతున్నారు.

ఇదిలా ఉంటే రెండవ జాబితా గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల విషయంలో షిఫ్టింగులు జంబ్లింగులు ఇతరత్రా వంటివి చేయబోతోంది అని అంటున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలలో డిస్కషన్ సాగుతోంది.

ఇదిలా ఉండగా రెండవ జాబితా రిలీజ్ అవుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాకినాడ జిల్లా వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హైకమాండ్ నుంచి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చిందని ప్రచారం సాగడంతో మిగిలిన వారిలో టెన్షన్ మొదలైంది.

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు చంటిబాబు, ప్రసాద్, దొరబాబులకి పిలుపు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో రాజకీయం మారుతోందని భావిస్తున్న నేపధ్యంలో జగ్గంపేటలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఎంపీపీల సమావేశం కావడం విశేషం. మరో వైపు చూస్తే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని పెండెం దొరబాబుని హైకమాండ్ అడిగినట్లుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె 2009లో పిఠాపురమ్నుంచి ప్రజారాజ్యం తరఫున గెలిచిన చరిత్ర ఉంది. ఆమె చాలా కాలంగా పిఠాపురంలో ఎక్కువగా పర్యటిస్తూ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం అని సంకేతాలు ఇచ్చేశారు.

దాంతో ఆమెను ఎమ్మెల్యేగా దొరబాబుని ఎంపీ అభ్యర్ధిగా జంబ్లింగ్ చేయాలని హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. అదే విధంగా జగ్గంపేట నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన తోట నరసింహం కి టికెట్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున తోట నరసింహం 2004, 2009లలో రెండు సార్లు గెలిచారు. మంత్రి కూడా అయ్యారు.

జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకు సంబంధించి పర్వత ప్రసాద్ కి టికెట్ విషయంలోనూ చర్చ సాగుతోంది. మొత్తానికి రెండవ జాబితాలో ఈ మూడు సీట్లు హైలెట్ గా మారనున్నాయని అంటున్నారు. దాంతో ఈసారి మండే గోదావరి జిల్లా వైసీపీకి యమ టెన్షన్ పెట్టేదిగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News