కోడిని కుక్క కరిచిందని వైసీపీ.. టీడీపీ వర్గీయులు కొట్టుకున్నారు
టీడీపీ నేత చలపాటి చంద్ర ఒక కోడిని పెంచుతున్నాడు. అతడి కోడిని వైసీపీకి చెందిన నేత నారాయణ రెడ్డి పెంచుకుంటున్న కుక్క దాడి చేసింది.
కారణం ఏమైనా కానీ ఏపీ అధికార వైసీపీ.. విపక్ష టీడీపీల మధ్య గొడవ పడటం.. కోట్లాటలకు దిగటం ఈ మధ్యన కామన్ గా మారింది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది.
గ్రామంలో కోడిని కుక్క కరిస్తే.. వైసీపీ.. టీడీపీ వర్గీయులు కొట్టేసుకున్న వైనం చూస్తే.. ఇదెక్కడి రాజకీయ పంచాయితీ అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అయితే.. కొట్టేసుకున్న ఇరు వర్గీయులపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తులసీ నాగప్రసాద్ చెబుతున్నారు.
సిద్దవటం గ్రామానికి చెందిన టీడీపీ నేత చలపాటి చంద్ర ఒక కోడిని పెంచుతున్నాడు. అతడి కోడిని వైసీపీకి చెందిన నేత నారాయణ రెడ్డి పెంచుకుంటున్న కుక్క దాడి చేసింది. దీంతో.. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది కాస్తా ఘర్షణగా మారింది. చివరకు కొట్టుకోవటం వరకు విషయం వెళ్లింది. ఈ ఘర్షణలో చలపాటి చంద్రకు గాయాలు కాగా.. ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ఉదంతంలో బాధితుడి ఫిర్యాదుపై నారాయణరెడ్డి.. అతడి కుమారుడు శ్రీనివాసుల రెడ్డిపైనా.. వారికి సహకరించిన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. తనను కులం పేరుతో దూషించాడంటూ చిన్ననాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రపైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
ఒక చిన్న విషయాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన రాజకీయ వైరం స్థానికుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. మారిన ఏపీ రాజకీయ పరిస్థితుల్ని ఈ ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.