షర్మిల ఉన్నంతవరకూ జగన్ సీఎం కాలేడా ?

దాంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల ఉండడంతో పాటు జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చింది.

Update: 2024-06-22 00:30 GMT

ఒకనాడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుని వైసీపీ తరఫున ప్రచారం చేసిన చెల్లెలు షర్మిల 2024 ఎన్నికల్లో ఎదురొచ్చింది. అదే బాణం వైసీపీ గుండెల్లో గుచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ పెట్టాక ఎన్నడూ చూడని ఘోర ఓటమిని మూటకట్టుకుంది. జస్ట్ 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి.

దాంతో వైసీపీ ఇపుడు పూర్తిగా నీరసం పడింది. రాజకీయ రాదారి తెలియక సతమతమవుతోంది. వైసీపీని షర్మిల బాగా దెబ్బ తీసింది అని ఎన్నికల ఫలితాల తరువాత వచ్చిన సమీక్షలు తెలియచేసాయి. నోటా కంటే తక్కువ ఓటు బ్యాంక్ తో వెనకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల వేలల్లో ఓట్లు దక్కాయి. ఏకంగా 2.8 శాతం ఓటు షేర్ కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో దక్కింది.

ఇలా కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు అన్నీ వైసీపీని చీల్చినవే అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. ప్రతీ ఒక్క ఓటూ అత్యంత ముఖ్యమైనదిగా మారింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల ఉండడంతో పాటు జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చింది.

దాంతో వైసీపీ ఓటు బ్యాంక్ బాగా తగ్గిపోయింది. నిజానికి వైసీపీకి 2014 నాటికి కూడా 45 శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఓటు బ్యాంక్ తగ్గేది కాదు, కానీ ఆ అయిదు పర్సంటేజి కాంగ్రెస్ గండి కొట్టేసింది. అలాగే ఏపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో అత్యధిక భాగం వైసీపీ ఖాతాలో పడాల్సినవి ఉన్నా కాంగ్రెస్ ఓట్ల చీలిక వల్లనే అవి పూర్తిగా పోయాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో షర్మిల పీసీసీ చీఫ్ గా ఈసారి మరింత దూకుడు చూపిస్తారు అని అంటున్నారు. ఆమె కేవలం మూడు నెలల కాలంలోనే తన సత్తా చాటుతూ వైసీపీకి దెబ్బ కొట్టారు. ఆమె చేతిలో అయిదేళ్ల కాలం ఉంటే ఆమె జనంలోకి వెళ్ళి ఆందోళనలు చేపట్టి కాంగ్రెస్ కి కొత్త ఊపు తీసుకుని రావడం ఖాయమని అంటున్నారు.

ఇక ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా పుంజుకుంటే అది వైసీపీకే తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేతలను కలసి వచ్చిన షర్మిల తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయని ఆమె వైసీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే ఆమెకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన టాస్క్ ఏంటో అర్ధం అవుతుంది.

ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలో నుంచి దించిన కాంగ్రెస్ ఇక మీదట తన ఓటు బ్యాంక్ ని వెనక్కి తెచ్చుకునే పనిలో పడుతుందని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కి యాంటీగా పీసీసీ చీఫ్ గా షర్మిలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం వెనక వ్యూహాలు కూడా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లోకి వైసీపీ నేతలను ఆహ్వానించడం కోసమే అని అంటున్నారు.

కేంద్రంలో చూస్తే ఈసారికి బీజేపీ సొంత మెజారిటీని సాధించలేకపోయింది. 2029 నాటికి కాంగ్రెస్ మరింతగా బలపడుతుంది. ఆ ప్రభావం ఏపీలో కూడా గట్టిగానే ఉంటుంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకుంటే వైసీపీ నుంచి చాలా మంది నేతలు విడిచి పోవడం ఖాయమని అంటున్నారు.

దాంతో జగన్ కి టీడీపీ కూటమితో పోరాటం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడం మరో ఎత్తు అని అంటున్నారు. ఒక్క శాతం ఓటు ఇటు నుంచి అటు టర్న్ అయినా వైసీపీకి 2029 ఎన్నికల్లో సైతం అధికారం దక్కడం కష్టమే అని అంటున్నారు.

ఇక వైఎస్సార్ ని ప్రేమించే వారు కేవలం వైసీపీలోనే లేరు. వారు వైసీపీ నచ్చకపోతే కాంగ్రెస్ నే ఎంచుకుంటారు. అలా ఓట్లు చీలడం ఖాయమని అంటున్నారు. అలా షర్మిల రాబోయే రోజులలో మరింతగా విజృంభిస్తారు అని అంటున్నారు. దాంతో ఆమె ఎంత దూకుడు చేస్తే అంతగా వైసీపీ నష్టపోవడం ఖాయమనే అంటున్నారు.

ఇపుడున్న రాజకీయ పరిణామాలు పొలిటికల్ సినారియో 2029 నాటికి ఉండదు. పూరిగా మారుతుంది. జనసేన టీడీపీ కలసి పోటీ చేస్తే కోస్తా జిల్లాలో వారి బలం కొంత తగ్గినా పై చేయిగానే నిలుస్తారు. అదే టైం లో విపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకమొత్తంగా తీసుకోకుండా కాంగ్రెస్ బలం పెరిగితే మాత్రం మళ్లీ ప్రతిపక్షానికే వైసీపీ పరిమితం అవుతుందని అంచనాలూ ఉన్నాయి. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నంతవరకూ వైసీపీకి జగన్ కి ఇబ్బందే అంటున్నారు. జగన్ మళ్లీ సీఎం కాలేడని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News