జగన్‌పై నాటి పొగడ్తలు ఇప్పుడెటుపోయాయ్ వైసీపీ మహిళా లీడర్లూ...!
కానీ, ఇది మంత్రి వర్గం విస్తరణకు ముందు.. తర్వాత.. అన్నట్టుగా మారింది. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముందు మహిళా నేతలు మరింతగా వైసీపీపై నోరు చేసుకుంటున్నారు.
టికెట్ దక్కితే ఒక మాట.. దక్కక పోతే మరో మాట! రాజకీయాల్లో ఇది కామనే. అయితే.. అన్నిపార్టీల్లోనూ ఉన్నట్టుగా వైసీపీలో పరిస్థితి ఉండదు కదా! మా నాయకుడు జగనే.. మా అధినేత జగనే.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చామంటూ.. 151 మందిలో సగం మందికిపైగా చెప్పిన మాట.. పాడిన పాట ఇదే!! దీంతో జగన్ మాట జవదాటరనే పేరును కూడా వారు తెచ్చుకున్నారు. కానీ, ఇది మంత్రి వర్గం విస్తరణకు ముందు.. తర్వాత.. అన్నట్టుగా మారింది. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముందు మహిళా నేతలు మరింతగా వైసీపీపై నోరు చేసుకుంటున్నారు.
వీరిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు. అసెంబ్లీలో ఆమె ఒక సందర్భంలోనే కాదు.. అనేక సందర్భాల్లో మాట్లాడుతూ.. జగన్ లేకపోతే.. తాములేమన్నారు. "అధ్యక్షా .. అందరి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటే.. నా గుండె మాత్రం.. జగన్ జగన్ అనే కొట్టుకుంటోంది. ఎక్కడో ఉన్న నన్ను తెచ్చి.. టికెట్ ఇచ్చి.. జగనన్న గెలిపించుకున్నారు అధ్యక్షా!" అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. కానీ, తన నియోజకవర్గంలో వ్యతిరేకత పొడచూపిన తర్వాత, పార్టీ టికెట్ ఇవ్వదని నిర్ధారించుకున్న తర్వాత.. అనూహ్యంగా శ్రీదేవి మాట మార్చారు. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
కట్ చేస్తే.. తాజాగా మరో ఎస్సీ మహిళా నేత, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా.. నోరు జారేశారు. 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలి. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా?. అలా అయితేనే నిధులు విడుదల చేస్తారా?. రెడ్డి సామాజికవర్గం ఓట్లు వేస్తేనే నేను ఎమ్మెల్యే కాలేదు, కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారు. మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారు. అని ఆమె రివర్స్ కామెంట్లు చేసేశారు. కానీ, ఈమె గతంలో అసెంబ్లీలో జగన్‌ను పొగుడుతూ.. నటుడు మహేశ్ బాబు డైలాగులు పేల్చారు. "నువ్వు దేవుడు సామీ" అని పొగిడిన విషయం గుర్తుండే ఉంటుంది.
చివరాఖరుకు..
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయంటే.. సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయంటే.. పురుష నాయకులు సరే.. మహిళా నాయకులు ఇలా రోడ్డెక్కిన సందర్భాలు గతంలో లేవు. ఏదైనా ఉంటే.. గుట్టుగా తేల్చుకనేవారు. కానీ, వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఒకరు.. వైసీపీలోనే ఉన్న మరొకరు.. ఇలా గతంలో చేసిన పొగడ్తలను మరిచిపోయి.. ఇప్పుడు రాజకీయం కోసం.. రోడ్డెక్కారనే వాదన బలంగా వినిపిస్తోంది.