భరణం తగ్గించుకోవటానికి జాబ్ చేయాలని ఒత్తిడి చేయలేరు
డిగ్రీ చదివిన తన భార్య ఉద్యోగం చేయాలని.. అందుకుబదులుగా నెలవారీగా తాను భరణం రూపంలో ఇస్తున్న రూ.25వేలును.. రూ.15వేలకు తగ్గించాలని కోరుతూ భర్త కోర్టును ఆశ్రయించారు.
దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురుకావటం కొత్తేం కాకున్నా.. ఆ కారణంగా భార్యభర్తలు ఇద్దరు విడిపోవాలన్న కఠిన నిర్ణయాన్ని తొందరపడి తీసుకునే ధైర్యం చేసే వారు కాదు. మారిన కాలానికి తగ్గట్లుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. గతంలో ఆడపిల్ల తల్లిదండ్రులు విడాకులంటే భయాందోళనలకు గురయ్యేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. దీనికి తోడు మారిన సామాజిక.. ఆర్థికపరిస్థితులతో పాటు.. ఆడపిల్లలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తుండటంతో.. సొంతంగా తమ కాళ్ల మీద తాము బతకగలిగే పరిస్థితులు ఉన్నాయి. దీంతో విడాకుల రేటు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఇదిలా ఉంటే.. విడాకుల వేళ.. భర్త ఇవ్వాల్సిన భరణం విషయానికి సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. విడాకులు ఇచ్చిన సందర్భంగా భార్యకు చెల్లించే భరణాన్ని తగ్గించుకోవటం కోసం ఉద్యోగం చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకురాకూడదన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో అప్పటివరకు ఇస్తున్న భరణాన్ని తగ్గించాలని కోరటాన్ని తప్పు పట్టింది.
డిగ్రీ చదివిన తన భార్య ఉద్యోగం చేయాలని.. అందుకుబదులుగా నెలవారీగా తాను భరణం రూపంలో ఇస్తున్న రూ.25వేలును.. రూ.15వేలకు తగ్గించాలని కోరుతూ భర్త కోర్టును ఆశ్రయించారు. బీఎస్సీ చదువుకున్న ఆమె.. జాబ్ చేసే అవకాశం ఉన్నా.. భరణం పొందటం కోసమే జాబ్ చేయటం లేదని ఆరోపించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సురేశ్ కుమార్ కైత్.. జస్టిస్ నీనా బన్సల్ క్రిష్ణలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది.
గతంలో కోర్టు నిర్ణయించిన భరణానికి సంబంధించి మధ్యలో కల్పించుకోవటానికి నో చెప్పింది. అదే సమయంలో భర్త చెల్లిస్తున్న భరణాన్ని పెంచాలన్న భార్య అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా భరణాన్ని తగ్గించుకోవటానికి మాజీభార్య జాబ్ చేయాలని కోరటం కూడా సరికాదని స్పష్టం చేసింది. భరణం చెల్లింపులో ఆలస్యం చేసినందుకు భర్తకు రూ.వెయ్యి ఫైన్ వేసిన కింది కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది. బకాయి పడిన మొత్తానికి ఆరు శాతం వడ్డీని జత చేసి భార్యకు ఇవ్వాల్సిందిగా ఆదేశించిన వైనం.. పలు సందేహాలకు సమాధానాల్ని ఇచ్చేలా మారిందన్న మాట వినిపిస్తోంది.