ఇక్కడ ఒక్కో స్త్రీకి సగటున 7.6 మంది పిల్లలు... వివరాలివే!

వాస్తవానికి అత్యధిక జనాభా ఉన్న పలు దేశాల్లో, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో నిన్న మొన్నటి వరకూ అధిక జనాభా అనేది ఓ సమస్యగా ఉండేదనే సంగతి తెలిసిందే

Update: 2025-01-20 19:30 GMT

వాస్తవానికి అత్యధిక జనాభా ఉన్న పలు దేశాల్లో, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో నిన్న మొన్నటి వరకూ అధిక జనాభా అనేది ఓ సమస్యగా ఉండేదనే సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సమస్య రివర్స్ అయ్యిందని అంటున్నారు. భారత్, చైనా, జర్మనీ, రష్యా సహా పలు దేశాలు ఇప్పుడు పిల్లలను ఎక్కువగా కనమని కోరుతున్న పరిస్థితి.

ప్రస్తుతం భారత్ లో ఈ తీవ్రత అంతగా లేకపోయినా.. చైనా, జర్మనీ, రష్యా వంటి దేశాల్లో ప్రమాద స్థాయికి చేరువలో ఉందని అంటున్నారు. ఈ సమయంలో పిల్లలను కనాలంటూ ప్రభుత్వాలు యువతకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జననాల రేటు పెరగడం అవసరాన్ని తెలియపరుస్తున్నాయి. ఈ సమయంలో జనాభాలో యువత అత్యధికంగా ఉన్న దేశం తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల తమ జనాభాలో యువత సంఖ్య తగ్గిపోతోందని.. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుల జనాభా ఎక్కువగా ఉన్న దేశం విషయం తెరపైకి వచ్చింది. ఈ దేశంలోని జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువవారేనట.

ఈ దేశం పేరు ఆఫ్రికన్ దేశమైన ‘నైజర్’. ప్రపంచ వ్యాప్తంగా పిన్న వయస్కుల జనాభా ఎక్కువగా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం ముందు వరుసలో ఉంటుందని చెబుతారు. ఐక్యరాజ్యసమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయసు 15 ఏళ్ల కంటే తక్కువ (14.8 ఏళ్లు) కావడం గమనార్హం.

అయితే.. ఇక్కడ జననాల రేటు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కాగా.. ఈ జననాల రేటు ఎక్కువగా ఉండటానికి పేదరికం, వనరుల కొరతే కారణంగా చెబుతున్నారు. ఇక్కడ సగటు జననాల రేటు ప్రతీ స్త్రీకి 7.6 మంది పిల్లలు కాగా... ప్రపంచ సగటు 2.5 మంది మాత్రమే! ఇక.. నైజర్ లో ఆయుర్దాయం సగటున సుమారు 58 ఏళ్లుగా చెబుతున్నారు.

వాస్తవానికి దేశంలో యువ జనాభా పెరగాలని చాలా దేశాలు కోరుకుంటున్న వేళ.. ఇక్కడ పెరుగుతున్న యువ జనాభా సమస్యగా మారిందని అంటున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు కూడా యువతకు అందడం లేదు. ఫలితంగా... ఇక్కడ నిరుద్యోగం, పేదరికం, బాల్య వివహాలు అనే పలు సమస్యలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News