బీజేపీకి 8 ఓట్లేసిన యువకుడు.. చివరకు జరిగింది ఇది!

పోలింగ్‌ బూత్‌ లోకి ఫోన్‌ తీసుకెళ్లడానికి అనుమతిని ఎన్నికల సంఘం రద్దు చేసింది.

Update: 2024-05-20 12:41 GMT

ప్రస్తుతం దేశంలో పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు విడతల పోలింగ్‌ లో భాగంగా ఇప్పటివరకు 5 దశల పోలింగ్‌ పూర్తయింది. మే 20న ఐదో దశ పోలింగ్‌ మొదలైంది. ఇంకో రెండు దశల పోలింగ్‌ తో ఎన్నికలు ముగుస్తాయి. ఏడో విడత జూన్‌ 1న ముగియనుంది.

కాగా పోలింగ్‌ లో అక్రమాలను నివారించడానికి ఎన్నికల సంఘం, పోలీసులు ఎంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్నిచోట్ల చెదురుమదురుగా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్‌ బూత్‌ లోకి ఫోన్‌ తీసుకెళ్లడానికి అనుమతిని ఎన్నికల సంఘం రద్దు చేసింది.

అయినప్పటికీ కొందరు పోలింగ్‌ బూత్‌ ల్లోకి పోలీసుల కళ్లు కప్పి తమ ఫోన్లను తీసుకెళ్తున్నారు. తాము ఎవరికి ఓటేశామో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. వాస్తవానికి ఇలా చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ కొందరు పోలింగ్‌ బూత్‌ లో ఓటు వేస్తుండగా తీసుకున్న సెల్పీ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వైరల్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన యువకుడు చేసిన పని దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకుగానూ అతడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లే కొద్ది రోజుల క్రితం నాలుగో విడత పోలింగ్‌ లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ లోని ఫరూఖాబాద్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓ యువ ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఇందులో ఏ తప్పు లేకపోయినా అతడు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేయడం అతడికి చిక్కులు తెచ్చిపెట్టింది. అతడు ఫరూఖాబాద్‌ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఖేష్‌ రాజ్‌పుత్‌ కు 8సార్లు ఓటేశాడు. ఇందుకు సంబంధించి అతడు సెల్పీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోలో అతడు పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి బీజేపీ అభ్యర్థి ఓటు వేసినట్లు కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ఈ వీడియోను ప్రతిపక్షాలు వైరల్‌ చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌ వాదీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మండిపడ్డాయి. బీజేపీ ఎన్నికల్లో గెలుపొందడానికి రిగ్గింగ్‌ చేస్తోందని ఆరోపించాయి.

మరోవైపు ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. ఉత్తర ప్రదేశ్‌ లోని నయాగావ్‌ పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడిని రాజన్‌ సింగ్‌ గా గుర్తించారు. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. అతడిపై జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారని తెలిపారు. మరోవైపు ఆ పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది.

Tags:    

Similar News