జగన్ కి షాక్ లాంటి లేఖ ?
దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తాజాగా తాను వైఎస్సార్ అభిమానులకు అంటూ బహిరంగంగా రాసిన లేఖ ద్వారా తన వైఖరి ఏంటి అన్నది కుండబద్ధలు కొట్టేశారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి షాక్ గట్టిగానే తగిలింది. తన సోదరితో విభేదాలు సహజం. ఏ కుటుంబంలో అయినా అన్న దమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వారి మధ్య ఎంతో కొంత విభేదాలు వస్తాయి. కానీ తల్లి మాత్రం ఇద్దరి వైపు ఉంటుంది.
ఏ సందర్భంలో అయినా ఆమె తటస్థంగా ఉంటుంది అని కూడా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చూసే దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తాజాగా తాను వైఎస్సార్ అభిమానులకు అంటూ బహిరంగంగా రాసిన లేఖ ద్వారా తన వైఖరి ఏంటి అన్నది కుండబద్ధలు కొట్టేశారు.
ఆమె లేఖ ఆద్యంతం చదివిన వారికి ఆమె షర్మిలకు మద్దతుగా ఉన్నారనే అభిప్రాయం వస్తుంది. అభిప్రాయమే కాదు తాను అన్యాయం జరిగిన వైపు ఉంటాను అని ఆమె ఆ లేఖలో చెప్పుకున్నారు. తనకు ఇద్దరు బిడ్డలు సమానమే అని అంటూ ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తూంటే చూస్తూ సహించలేనని కూడా ఆమె స్పష్టం చేశారు.
ఆస్తిలో జగన్ కి షర్మిలకు సమానమైన హక్కులే ఉన్నాయని మరో కీలకమైన పాయింట్ ని ఆమె చెప్పారు. అంతే కాదు అది జగన్ ఒక్కడి ఆస్తి కాదని కుటుంబ ఆస్తి అని మరో పాయింట్ కూడా చెప్పారు. షర్మిలకు జగన్ ఇచ్చిన రెండు వందల కోట్ల రూపాయలు హక్కుగా డివిడెండ్ గా ఇచ్చారు తప్ప గిఫ్ట్ గా ఇవ్వలేదని అన్నారు. అలాగే ఎంఓయూ రాసినది కూడా హక్కుగానే తప్పించి మరోటి కాదని అన్నారు.
వైఎస్సార్ కి ఇద్దరు బిడ్డలు వారికి పుట్టిన నలుగురు బిడ్డలు సమానం అని వారందరికీ సమానమైన ఆస్తి పంపకాలు జరగాలన్నది ఉద్దేశ్యం అని అన్నారు. మొత్తం మీద చూస్తే కనుక జగన్ మీద షర్మిల చేస్తున్న విమర్శలు అన్నీ విజయమ్మ లేఖలో ఉన్నాయి. ఆమె మాటలు అన్నీ కూడా కుమార్తెకు మద్దతుగానే ఉన్నాయి.
జగన్ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలలో కుమార్తెకు కీలక పాత్ర ఉందని తల్లిగా ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు రాజకీయాల్లో జగన్ ఏమి చెప్పారో అదే షర్మిల చేశారు అని అన్నారు. జగన్ సీఎం కావడంలో షర్మిల పాత్ర ఎంతో ముఖ్యమైనది అని కూడా ఆమె చెప్పడం ద్వారా షర్మిల ఇంత కాలం చేస్తున్న వాదనకు కొత్త బలం చేకూర్చారు.
మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఈ ఇద్దరి మీద కూడా విజయమ్మ లేఖలో విమర్శల బాణాలే వేశారు. ఈ ఇద్దరికీ అన్ని విషయాలూ తెలుసు. అన్ని నిజాలూ తెలుసు. తెలిసి కూడా వారు అబద్ధాలు మాట్లాడుతున్నరు అని విజయమ్మ చెప్పడం విశేషం.
ఇక వైసీపీలో కొంతమంది కీలక నేతలు మాట్లాడుతున్న మాటలను కూడా ఆమె పరోక్షంగా తప్పు పట్టారు. వైఎస్సార్ మీద ఆయన కుటుంబం మీద గౌరవం తగ్గించేలా ఈ నాయకులు మాట్లాడారు అని ఆమె అన్నారు వారికి తెలిసో తెలియకో ఇలా మాట్లాడారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవన్నీ జాగ్రత్తగా గమనించినపుడు విజయమ్మ తాను కుమార్తె షర్మిల వైపే అని చెప్పకనే చెప్పేశారు. ఇక వైఎస్సార్ కుటుంబం రెండుగా విడిపోవడానికి ఇజ్రాయిల్ టూర్ లో జగన్ చేసిన ప్రతిపాదనే కారణం అని కూడా ఆమె మరో వాస్తవం చెప్పారు.
మొత్తానికి ఆమె చెప్పినవి అన్నీ వాస్తవాలు అంటూనే కుమారుడి వైపు నుంచి త్రాసు కుమార్తె వైపుగా తిప్పారు. బిడ్డలు ఇద్దరూ తల్లికి సమానం అని ఆమె చెబుతూనే తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందని వాపోవడం ద్వారా ఇండైరెక్ట్ గా జగన్ ని కార్నర్ చేసినట్లు అయింది అని అంటున్నారు ఏది ఏమైనా ఈ లేఖ వైసీపీకి బాకు గా మారుతోంది.
అదే సమయంలో జగన్ మీద విపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత ఊతమిచ్చేలా ఉంది. తల్లిని చెల్లెలుని జగన్ బయటకు పంపించారు అన్న విమర్శలకు ఇంతకాలం తల్లి నుంచి ఏమీ రియాక్షన్ లేదు కానీ ఇపుడు విజయమ్మ లేఖ సాంతం చూశాక మాత్రం ఆమె కుమార్తె సైడ్ నే తీసుకున్నారు అని అభిప్రాయం బలపడుతోంది. మరి దీని మీద వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. అయితే ఇది కుటుంబ సమస్య కాబట్టి జగన్ మాత్రమే దీనిని పరిష్కరించుకుని వైసీపీని దీని బారి నుంచి కాపాడి ప్రత్యర్ధుల విమర్శలకు చిక్కకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు