వారి కల సాకారం చేస్తున్న వైసీపీ.. ఇక, పండగే!
ఏపీ సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలకమైన హామీని ఆయన నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్నారు
ఏపీ సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలకమైన హామీని ఆయన నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు.. ఇలా అర్హులైన వారికి ఇచ్చే సామాజిక పింఛన్‌ను రూ.3000లకు పెంచే ఫైలుపై సంతకం చేయనున్నారు. ప్రస్తుతం అర్హులైన వారికి 2750 చొప్పున పింఛనును ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. 2019 ఎన్నికల సమయానికి వారికి రూ.2000 మాత్రమే పింఛను ఉండేది. ఒకవైపు పెరిగిపోతున్న ధరలు.. మరోవైపు, చాలీచాలని పింఛనుతో ఇబ్బంది పడుతున్నవారు.. జగన్ అప్పట్లో చేసిన పాదయాత్ర సమయంలో తమ సమస్యలు చెప్పుకొచ్చారు. పింఛను పెంచాలంటూ.. అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకు లబ్ధిదారులు వేడుకున్నారు. దీంతో మనసు కరిగిన వైసీపీ అధినేత.. దీనిని రూ.3000లకు పెంచుతానని హామీ ఇచ్చారు.
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఏటా ఈ పింఛనును పెంచుకుంటూ పోతానని కర్నూలు సభలో తొలిసారి ప్రకటించారు. దీనిపై పార్టీ పరంగా కూడా అధ్యయనం చేశారు. ఏటా రూ.250 చొప్పున పెంచే అవకాశం ఉందని నివేదికలు రావడంతో ఎన్నికల సమయంలో ఈ మాటే చెప్పారు. ఏటా రూ.250 చొప్పున పెంచి.. మళ్లీ ఎన్నికల సమయానికి(2024) పింఛనును రూ.3000లకు చేర్చుతామన్నారు.
మాట ఇచ్చినట్టుగానే.. రాష్ట్రంలోని లబ్ధిదారులకు రూ.250 చొప్పున ఏటా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికి మూడు సార్లు పెంచారు. ఇక, చివరి విడత రూ.250ని శుక్రవారం(ఈరోజు) పెంచనున్నట్టు ప్రభుత్వవర్తాలు చెబుతున్నాయి. ఇది.. ఆర్థిక శాఖ ఆమోదానికి వెళ్లి.. అనంతరం.. వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని అంటున్నాయి. దీంతో ప్రతి లబ్ధిదారునికి రూ.3000 చొప్పున పింఛను అందనుంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛను పొందుతున్నవారు...65 లక్షల 33 వేల మంది ఉన్నారు. వీరందరికీ జగన్ నిర్ణయంతో భారీ మేలు జరగనుంది.