ఏపీలో ఎన్నికలు ఎపుడో చెప్పిన జగన్...!

ఏపీలో ఎన్నికల మీద అన్ని రాజకీయ పక్షాలకు ఒక స్పష్టత ఉందని భావించాలి. ఇక అధికార పార్టీకి దీని మీద సంకేతాలు కూడా వస్తాయని అంటున్నారు

Update: 2023-12-15 11:16 GMT

ఏపీలో ఎన్నికల మీద అన్ని రాజకీయ పక్షాలకు ఒక స్పష్టత ఉందని భావించాలి. ఇక అధికార పార్టీకి దీని మీద సంకేతాలు కూడా వస్తాయని అంటున్నారు. కేంద్రంలోని ఈసీ ఎప్పటికపుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మీద సన్నద్ధం చేస్తూ వస్తోంది.

దాంతో ఎన్నికలు ఎపుడు అంటే మాత్రం ఏప్రిల్ లో అని ఒక మాట అయితే ఉంది. గతసారి అంటే 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం దానికి ఒక ఇరవై రోజుల ముందే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ చెప్పారని అంటున్నారు.

అంటే మార్చి 20న ఎన్నికలు ఏపీలో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. ఇక జగన్ ఎన్నికల మీద కీలకమైన వ్యాఖ్యలే చేసారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ ముందే వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం. అలాగే ఇరవై రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని జగన్ స్పష్టంగా చెప్పారు. అందువల్ల మంత్రులంతా మరింత కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది.

దీన్ని బట్టి చూస్తే ఎన్నికలకు ముందు నెల రోజుల ముందు నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరి 20లోగా వస్తుంది అని అంటున్నారు. అంటే కొత్త ఏడాది మొదలవుతూనే ఎన్నికల దిశగానే అంతా సాగుతారు అన్న మాట. జగన్ ఈ మాట చెప్పారు అంటే బలమైన ఆధారాలతోనే అని అంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ మంచి ఊపు మీద ఉంది. సెమీ ఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించింది. మూడు రాష్ట్రాలను గెలుచుకుని సత్తా చాటింది. ఆ ఊపు అలా ఉండగానే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు.

నిజానికి డిసెంబర్ లోనే కేంద్రం ఎన్నికలు వెళ్లాలని చూసింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే రామమందిరం ప్రారంభం వంటి భవ్యమైన కార్యక్రమం ఉంది. జనవరి 22న ఆ కార్యక్రమం పూర్తి అవగానే బీజేపీ కూడా ఎన్నికల సన్నాహాల్లో పడుతుంది అని అంటున్నారు. బడ్జెట్ సెషన్ లో ఓటాను అకౌంట్ ప్రవేశపెడితే కేంద్రానికి ఎన్నికలకు వెళ్లడం చాలా సులువు అవుతుంది.

అన్నీ ఆలోచించుకుంటే కనుక ఫిబ్రవరి మూడవ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి ఏప్రిల్ నెలలలో రెండు నెలల పాటు ఏడు దశలలో ఎన్నికలు పెడతారు అని అంటున్నారు. అంటే మే నెల మండుటెండలు రాకుండానే కేంద్రంలో ఏపీలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరేలా ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది అన్న మాట. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా పరీక్షలను ముందుకు జరిపింది. ఇపుడు జగన్ ముందే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అని చెప్పడంతో ఎన్నికల ఫీవర్ ఏపీకి వచ్చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News