అమ్మా సౌభాగ్యమ్మా... సంచలన ప్రశ్నలతో లేఖ రాసిన అవినాష్ తల్లి!
ఈ సమయంలో ఆ లేఖలో ఆమె ప్రస్థవించిన అంశాలకు కౌంటర్ ఇస్తూ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మీ ఒక లేఖను విడుదల చేశారు!
ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా ఒకెత్తు.. ప్రత్యేకంగా కడప రాజకీయం మరొకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే! ప్రధానంగా వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, వైఎస్ జగన్ లపై షర్మిల, సునీత చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయాల్లో మరింత కాకరేపుతున్న పరిస్థితి. ఈ సమయంలో వైఎస్ సునీత తల్లి సౌభాగ్యమ్మ.. జగన్ కు ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ లేఖలో ఆమె ప్రస్థవించిన అంశాలకు కౌంటర్ ఇస్తూ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మీ ఒక లేఖను విడుదల చేశారు!
అవును.. వైఎస్ జగన్ కు వివేకా భార్య సౌభాగ్యమ్మ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2009లో మీ తండ్రిని కోల్పోయినపుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం.. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఎంతో బాధించింది" అంటూ ఆమె లేఖలో ప్రస్థావించారు. ఈ నేపథ్యంలో వైఎస్ లక్ష్మీ ఒక లేఖ రాశారు.
ఇందులో భాగంగా... "అమ్మా సౌభాగ్యమ్మా.. 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడనేది ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా?" అంటూ కీలక అంశం లేవనెత్తిన వైఎస్ లక్ష్మీ... 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్నచూపు చూసినప్పుడు జగన్ కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు.. జగన్ ను ఒంటరిని చేసి మీ స్వార్ధం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా"? అని సూటిగా ప్రశ్నించారు.
ఇదే క్రమంలో... "2011లో నీభర్తను.. నీవు, నీ కుమార్తె, నీ అల్లుడు కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వారి మనోవేదన ఎలా ఉండినాదో మీకు తెలియదా. నీ కుమార్తె, నీ అల్లుడు పూల అంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవించారో మీకు తెలియదా?" అని మరో ప్రశ్న సంధించారు వైఎస్ లక్ష్మీ!
అదేవిధంగా... "వివేకానందరెడ్డి.. వైఎస్ జగన్ ను సీఎంగా చూడాలని కోరుకున్నమాట ఎంతో వాస్తవం. అలాగే మార్చి 2019 ది 14 రాత్రి కూడా అవినాష్ ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయన్ని స్వయంగా మీ కూతురు సునీత మీడియాకు వెల్లడించింది. ఇవాళ మీరు అదే ఎంపీ టిక్కెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేనివారిని ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా.. ఎవరిని కాపాడు కోవడం కోసం ఇలా చేస్తున్నారు" అని ఇంకో ప్రశ్న లేవనెత్తారు!
ఇదే సమయంలో... "మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే.. తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాకాకుండా మీ కుమార్తె.. వైఎస్సార్ గారు, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి, సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి, వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు"? అంటూ నిలదీశారు!
అనంతరం... "హత్యకు కారకులైనవారు మీతోనే ఉన్నారు. మీలో ఉన్నారు. దింగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ" అని చెబుతూ... "మాటిమాటికీ హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు" అని సూటిగా ప్రశ్నించారు!
"అలా మాట్లాడటం తప్పనిపించడం లేదా మీకు. నీ కుమార్తెను, షర్మిళను ఎవరూ టార్గెట్ చేయలేదు.. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం" అని స్పష్టం చేశారు. "ఇప్పటికైనా వైఎస్సార్ గారు, జగన్ శత్రువుల చేతుల్లో పావులుగా ఉండకుండా.. వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకు వచ్చి, చేసిన తప్పు తెలుసుకుని, నిజమైన న్యాయ పోరాటం చేయండి.." అని సూచించారు!
ఇదే క్రమంలో... "అన్యాయంగా మీవలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బందిపడుతున్నారో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయట పడుతుంది" అని తెలిపారు వైఎస్ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మీ! ఇప్పుడు ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా కడప జనాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుందని అంటున్నారు.