వైఎస్సార్ అన్న మూడక్షరాలూ మంత్రాక్షరాలు !

వైఎస్సార్ అన్న పేరు రాజకీయంగానే కాదు సగటు జనం గుండెలలో మారుమోగుతూనే ఉంటుంది.

Update: 2024-07-08 03:59 GMT

వైఎస్సార్ అన్న పేరు రాజకీయంగానే కాదు సగటు జనం గుండెలలో మారుమోగుతూనే ఉంటుంది. మూడున్నర పదుల రాజకీయ జీవితం తెలుగు ప్రజలతో పెనవేసుకుని పోయిన రాజశేఖరుని జీవితం అది. ఆయనకు జనం నాడి ఎపుడూ తెలుసు. ఎందుకంటే ఆయన పేరొందిన ప్రజా వైద్యుడు కదా.

కేవలం రూపాయి మాత్రమే తీసుకుని పేదలకు సేవ చేసిన వైద్యుడు వైఎస్సార్. ఆయన తన వైద్య విద్యను పూర్తి చేసుకుని వచ్చాక పులివెందులలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ సమయంలో వైఎస్సార్ కి రాజకీయాల మీద ఆసక్తి లేదు. ప్రజలకు వైద్యం అందించాలన్నదే కోరిక.

అయితే ఆయన ప్రజా వైద్యుడిగా సాధించిన పేరు ప్రఖ్యాతులు చూసిన మీదట కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆహ్వానం లభించింది. అలా యువజన నాయకుడిగా వైఎస్సార్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అది కూడా పులివెందుల యూత్ కాంగ్రెస్ లీడర్ గానే తొలి ప్రస్థానం సాగింది.

ఆ సమయంలో జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోవడంతో రెడ్డి కాంగ్రెస్ తరఫున ఆయన 1978లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ రోజులలో చిన్న పాంప్లెట్ మీద తన వివరాలు అన్నీ రాసి వైఎస్సార్ జనాలలో దానినే పంపిణీ చేశారు. తాను ప్రజా వైద్యునిగా పరిచయం ఉన్నాయని తనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు వినతి చేశారు.

ఆయనకు పోటీగా ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధి ఉన్నారు జనతా పార్టీ నుంచి మరో గట్టి పోటీ ఉన్నా పులివెందుల ప్రజలు వైఎస్సార్ నే తమ నేతగా ఎంచుకుని అలా తొలిసారి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లకు అంటే 1980 ప్రాంతంలో ఆయన అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. భవనం వెంకటరాం, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కూడా పనిచేశారు. అలా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను చూసారు.

ఇక వైఎస్సార్ 1983 నుంచి 1985 వరకూ రెండేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే 1998 నుంచి 2000 దాకా మరోసారి పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నారు. అయన 1989 నుంచి 1998 దాకా నాలుగు సార్లు ఎంపీగా అలాగే ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

వైఎస్సార్ కి మంత్రి పదవులు చిన్న వయసులో లభించినా ముఖ్యమంత్రి పీఠం మాత్రం దక్కలేదు. ఆయన 1989 నుంచి ఆ పదవి కోసం ప్రయత్నం చేసినా 2004 వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఇక సీఎం గా వైఎస్సార్ సరికొత్త ఇమేజ్ ని సాధించారు. కాంగ్రెస్ సీఎం గా ఆయన పూర్తిగా స్వతంత్ర బాటలోనే సాగారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని పాలించారు.

వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఉచితంగా ఉన్నత చదువులు చదివేందుకు అందించిన ఫీజు రీ ఇంబర్స్ మెంట్ అలాగే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇలాంటి పనులతో జనం గుండెలలో నిలిచారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ ప్రగతి బాటన సాగింది. అలాగే సంక్షేమం కూడా చక్కగా జరిగింది.

వైఎస్సార్ తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని 2009 ఎన్నికల్లో మరోసారి గెలిపించారు. 2004, 2009లలో రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన యూపీఏ వన్ యూపీయే టూ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన మూడు నెలల కాలంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయి ఈ లోకాన్ని వీడిపోయారు. వైఎస్సార్ అంటే పేదల గుండె చప్పుడుగా నిలిచారు. ఆయన అమలు చేసిన పధకాలను జనాలు ఈ రోజుకీ గుర్తు చేసుకుంటారు. వైఎస్సార్ తెలుగు నాట అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా నిలిచిపోయారు.

Tags:    

Similar News