జగన్ లో ఆ ఫైర్ ఏదీ ?

జగన్ అంటే గన్ అని చెప్పుకునేవారు. ఆయన ఫైర్ ని గురించి వేరేగా చెప్పాల్సింది లేదు.

Update: 2024-09-22 00:30 GMT

జగన్ అంటే గన్ అని చెప్పుకునేవారు. ఆయన ఫైర్ ని గురించి వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన యువనేతగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి ఏపీలో అప్పటిదాకా ఉన్న రెండు బలమైన పార్టీలు కాంగ్రెస్ టీడీపీలను ఎదుర్కొని ధీటుగా వైసీపీని తీర్చిదిద్దారు.

జగన్ సవాళ్ళను చాలా గట్స్ తో ఎదుర్కోనేవారు. ఆయన జనంలోకి వస్తే అది ప్రభంజనమే అయ్యేది. జగన్ అంటే జనం అన్నట్లుగా ఉండేది. రాజకీయ నాయకులలో వర్తమాన తరంలో జగన్ కి ఉన్న క్రేజ్ అలాంటివి అన్న చర్చ కూడా సాగేది.

జగన్ కి ఎన్నికల్లో గెలుపోటములు కొత్త కాదు, ఆ మాటకు వస్తే ఆయన వాటికి అతీతంగా ఉండేవారు. తన లీడర్ షిప్ క్వాలిటీస్ తో ఎటువంటి పెను విపత్తులను అయినా చాలా ఈజీగా ఎదుర్కొనేవారు. జగన్ గట్స్ ని చూసే అంతా ఆకర్షితులు అయ్యేవారు

ఆయన ఉంటే చాలు పార్టీకి ఏమి కావాలి అని గుండె మీద చేయి వేసుకుని ధీమాగా ఉండేవారు. అలాంటి జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక పరదాల మాటుకు వెళ్ళిపోయారు అన్నది కూడా అంతా అనుకునే మాట. అయిదేళ్ళకు పైగా అయింది ఇప్పటికీ జగన్ ఆ పరదాలు దాటుకుని బయటకు రావడం లేదు.

జగన్ అంటే భయం లేని వారు గా చెబుతారు. ఆయన రాజకీయ సాహసిగా ఉండేవారు. అలాంటిది ఆయన ఇపుడు ఎందుకో అలా వ్యవహరించలేకపోతున్నారు. ఆయన లేటెస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయండి మామీద మమ్మల్ని అలా ఎదుర్కోండి ఇలా దేవుడిని అడ్డం పెట్టుకుని కాదు అని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

అది బాగానే ఉంది కానీ ప్రత్యర్థి తాము అనుకున్నట్లుగా తాము కోరుతున్నట్లుగా ఎలా ఎందుకు ఉంటారు అన్నది చర్చ. ఆయన ఎన్ని అయినా ఎత్తులు వేస్తాడు, వేసిన వాటిని ఎదుర్కోవడమే రాజకీయ నేతల లక్షణం. ఏటికి ఎదురీదాలి. జగన్ అయితే అలా చేయలేకపోతున్నారు

జగన్ ఇపుడు కూడా మీడియా మీట్ ఒకటి పెట్టి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద మాట్లాడి ఊరుకున్నారు. ప్రపంచం మొత్తం ఈ ఇష్యూ అంటుకుంది. కోట్లాది మంది రగిలిపోతున్నారు. ఈ కీలకమైన సమయంలో జగన్ చేయాల్సింది ఇంతేనా అన్న చర్చ ఉంది.

ఆయన పార్టీ వారే అయిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పినట్లుగా జగన్ తిరుమలకు వెళ్ళి శ్రీవారి ఎదుటనే తాము ఏ తప్పూ చేయలేదని చాటి చెప్పి శ్రీవారి భక్తుల విశ్వాసం పొందాల్సిన అవసరం లేదా అని అంటున్నారు.

జగన్ జ్యూడీషియల్ విచారణ కోరారు. సీబీఐ విచారణ కోరారు. బాగానే ఉంది. ఆ విచారణలు జరిగి నివేదికలు రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా రాజకీయంగా జగన్ చేయాల్సిన యుద్ధం ఏమీ లేదా అన్న చర్చ సాగుతోంది. జగన్ ని రాజకీయంగా అభాసుపాలు చేయడానికి దేవుడిని చంద్రబాబు వాడుకుంటున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.

కానీ ఈ విషయంలో తాము తప్పు చేయలేదని గట్టి వాదన ఏదీ వైసీపీ వినిపించ లేకపోతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పార్టీలో సీనియర్ నేతలు అంతా పోతూ ఉంటే పోతే పోనీయ్ అన్న ధోరణిలో మీడియా ముఖంగా జగన్ రాయలసీమ యాసలో అన్న మాటలు కూడా వైసీపీకి డ్యామేజ్ గానే చూడాలని అంటున్నారు.

నాయకుడు అన్న వారు ప్రజలను నమ్ముకోవడం నూరు శాతం కరెక్ట్. అదే టైం లో నాయకుడు తన సేనలను కూడా కాపాడుకోవాలి. ప్రజలకు అధినాయకుడికి వారే వారధులుగా ఉంటారు. ముందు సొంత పార్టీ వారి విశ్వాసం చూరగొననపుడు ప్రజలు ఎలా పట్టించుకుంటారు అని ఆలోచించాల్సిందే.

ఇంకో వైపు చూస్తే జగన్ ఎంత సేపూ చంద్రబాబు తప్పులు చేస్తారు ఆయన సంక్షేమ పధకాలు అమలు చేయలేరని అందువల్ల తిరిగి అధికారం బంగారు పళ్ళెంలో పెట్టి తమకు దఖలు పడుతుందని భావిస్తున్నారు. యాంటీ ఇంకెంబెన్సీ అని అంటున్నారు. అది ఎపుడూ ఉంటుందా అలా అయితే మోడీ మూడు సార్లు ప్రధాని ఎలా అవుతారు, అలాగే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరసగా ఎలా గెలుస్తున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. తమిళనాడులో కూడా రెండు సార్లు వరసగా జయలలిత గెలిచి పాత సంప్రదాయనికి తెర వేశారు. అందువల్ల జగన్ మారాలి అని అంటున్నారు.

ఆయన నింపాదిగా కూర్చోకుండా అగ్రెసివ్ మోడ్ లో వెళ్ళాలని సూచిస్తున్నారు. ఆయన యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకోవాలని అంటున్నారు. టీడీపీ అధినేత జగన్ ని ఏ మాత్రం లైట్ తీసుకోవడం లేదు, మరి జగన్ బాబుకు లైట్ తీసుకుంటే మాత్రం ఆయానే కాదు పార్టీ ఉనికికి అది అతి పెద్ద ముప్పు అని అంటున్నారు.

Tags:    

Similar News