కడపలో కుదుపులు కాదు.. భూకంపాలే!
వైసీపీకి, మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబానికీ బలమైన జిల్లా ఏదైనా ఉంటే.. అది ఉమ్మడి కడపే.
వైసీపీకి, మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబానికీ బలమైన జిల్లా ఏదైనా ఉంటే.. అది ఉమ్మడి కడపే. నేడు అది రెండు జిల్లాలుగా ఏర్పడినా (అన్నమయ్య + వైఎస్సార్) ఇక్కడ వైసీపీ హవాకు కొదవ లేదనే అనుకునే పరిస్థితి ఉండేది. కానీ, ఈ తరహా భరోసా 2024 కుదిపేసింది. 2019లో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూ వైసీపీ విజయం దక్కించుకుంటే.. ఈ దఫా అది మూడుకు పడిపోయింది. అయితే.. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలను మాత్రం నిలబెట్టుకుంది.
ఇక, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే.. 2024లో ఏర్పడిన కుదుపులు .. 2025 నాటికి భూకంపాలను సృష్టించే పరిస్థితికి వచ్చింది. కడప కార్పొరేషన్లో వైసీపీ కుర్చీలు కదలిపోతున్నాయి. ఇప్పటికే 8 మంది పార్టీ మారగా.. మరో 10 మంది ఏ రాత్రికి ఎటు మళ్లుతారో చెప్పలేనంతగా పరిస్థితి దిగజారింది. ఇటీవల పులివెందులలో క్రిస్మస్‌వేడుకలకు జగన్ హాజరైనప్పుడు.. ఇదే పరిస్థితి ఉందని స్పష్టంగా తెలిసింది. కొన్నాళ్ల కిందట ఎదురేగి వచ్చిన అభిమానులు ఈ సారి పలచపడ్డారు.
కొన్నాళ్ల కిందట.. జగన్ వస్తున్నాడంటే.. చూచాయగా ఆయన కంట్లో పడితే చాలనుకున్న నాయకులు.. ఆయన ముందు నిలబడి.. తమ బకాయిల సంగతేంటని వైసీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి నిలదీసే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా పిల్ల నాయకులు పెద్ద కేకలే పెట్టారు. ఇది రాజకీయంగా వైసీపీకి కుదుపులు కాదు.. భూకంపమే సృష్టించేందుకు రెడీగా ఉన్న పరిణామంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక, కీలక నాయకులు కూడా.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అదేసమయంలో వివేకానందరెడ్డి హత్య అనంతరం కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నం చేసినా.. కొందరు మాత్రమే ఇటీవల జగన్‌కు మద్దతు పలికారు. మరికొందరు ఇంకా దూరంగానే ఉన్నారు. షర్మిల దూకుడు.. టీడీపీ నేతల వ్యూహాలతో వైసీపీ నేతలు దూరమవుతున్నారు. ఇంకోవైపు.. బీటెక్ రవి ఇక్కడే తిష్ఠవేసి.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పులివెందులకు నీటిని పారించడం ద్వారా.. ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాల్లో టీడీపీ నేతలు ఉన్నారు. వెరసి.. 2025లో కడపలో వైసీపీ ప్రభావం నామమాత్రంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం.