జగన్ కి బాగా అర్ధమవుతోందా ?

జగన్ కి రాజకీయం కొత్త కాదు. ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది.

Update: 2024-08-29 16:30 GMT

జగన్ కి రాజకీయం కొత్త కాదు. ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది. పైగా ఆయన గత పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అయినా సరే ఏదో కొత్తగా రాజకీయాలు చేయాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కాదు, రాజకీయాల్లో ఎపుడూ అవకాశవాదానిదే పెద్ద పీట. ఆ విషయం మరచి తాను పదవి ఇస్తే నమ్ముకుని ఉంటారు అనుకుంటే పొరపాటే అని జగన్ కి ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చెబుతున్నా ఇంకా తత్వం అర్ధం కాలేదా అన్నది చర్చగా ఉంది.

జగన్ తన రెక్కల కష్టంతో 2014లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వారిలో 23 మందిని అప్పటికి టీడీపీ లాగేసింది. జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక తాను అలాంటి పనులు చేయను అని ఒట్టు పెట్టారు. సరే టీడీపీ నుంచి ఒక నలుగురు జనసేన నుంచి ఒకరు ఎమ్మెల్యే వచ్చి అనుబంధంగా కూర్చుకున్నారు. అప్పటికి సంతోషం ఏమిటి అంటే వారికి జగన్ ఏనాడూ కండువాలు కప్పలేదు.

ఇక జగన్ టీడీపీ ఎమ్మెల్సీలను ఎవరినీ ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు. కానీ మూడేళ్ల తరువాత మండలిలో వైసీపీ బలం పెరిగింది. ఇపుడు మెజారిటీ ఉంది. ఒక విధంగా చూస్తే వైసీపీకి ఇదే పెద్ద దిక్కుగా ఉంది. అలాగే రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు. వీరిని చూసుకుని జగన్ బలం గా ఉన్నారని అనుకోవచ్చు.

కానీ సరిగ్గా ఇక్కడే అవసరం అవకాశం కలసి రాజకీయం చేస్తాయని జగన్ ఎందుకు ఊహించుకోలేక పోయారో అర్ధం కాదు. రాజకీయాల్లో అవసరాలతో అవకాశాలు ఏర్పడతాయి వాటిని వాడుకున్న వారే రాజకీయం నేర్చిన వారు. అంతే తప్ప మడి కట్టుకుని కూర్చున వారు కారు. ఇది నయా నీతి ఏ మాత్రం కాదు, ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితం చాణక్యుడే చెప్పిన రాజనీతి.

రాజకీయం ఇలాగే ఉంటుంది. ఇది ఒక ఆట. అవతల వారు ఇదే నియమంతో ఆడుతున్నపుడు ఇవతల వారు కూడా అలాగే రాజకీయం ఆట ఆడాలి. లేదు మేము వేరే పద్ధతిలో ఆడతామని అంటే తల బొప్పి కడుతుంది. ఏపీలో జరుగుతున్నది ఇదే. జగన్ అధికారంలోకి వచ్చాక సొంత సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు అన్న విమర్శలు ఉన్నాయి.

అదే విధంగా సామాజిక సమీకరణలు అని కొత్త ప్రయోగాలు చేశారు. విధేయతకు పెద్ద పీట అని కొందరిని అందలాలు ఇచ్చారు. మరికొందరికి కాంబినేషన్ బాగుంటుందని అనుకుని చాన్స్ ఇచ్చారు. ఇపుడు వారే జగన్ కి పార్టీకి వెన్నుపోటు పొడిచి పోతున్నారు. జగన్ వారికి ఏమీ తక్కువ చేయలేదు, ఆ సంగతి వారికి కూడా తెలుసు.

కానీ ఇపుడు జగన్ వారికి ఏమీ చేయలేరు. పార్టీ ఘోరంగా ఓడింది. అందుకే వారు వేరే అవకాశాలు చూసుకుంటున్నారు. ఇందులో వారిని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇదే రాజకీయం కాబట్టి. ఎవరికి పదవులు ఇచ్చినా ఇలాగే పోతారు. అలాగని ఎవరికీ పదవులు ఇవ్వకూడదని కాదు, ఇచ్చేటపుడు అన్నీ చూసుకోవాల్సి ఉంది.

అంతే కాదు నేను ఇచ్చాను వారు ఆనందంగా ఉన్నారు అని జగన్ అనుకోవచ్చు. కానీ అప్పట్లో జగన్ సీఎం గా ఉండడం వల్ల వారు నోరు మెదపకపోయినా వారు కోరుకున్న పదవి దక్కలేదు అన్నది ఇపుడు బయటపెడుతున్నారు. అదే సాకుగా చూపించి వారు పార్టీ గోడ దాటుతున్నారు. నిజానికి జగన్ 2014 ఎన్నికల్లో ఓడిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా చాన్స్ ఇచ్చారు.

కానీ ఆయనకు ఇంకా కోరికలు ఉన్నాయి. రాజకీయాల్లో అలాగే ఉంటాయి. వాటిని అధినేత అర్ధం చేసుకోవాలి. బుజ్జగించే ప్రయత్నం అయినా చేయాలి. కానీ నేను ఇచ్చేశాను కదా అని ఊరుకుంటే అలాగే ఆళ్ళ లాగ బయటకు వెళ్తారు. మోపిదేవి వెంకట రమణ వైఎస్సార్ హయాం నుంచి వైసీపీలో ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారిపోయారు. కారణం ఏమిటి అంటే ఆయనకు కూడా వేరే కోరికలు ఉన్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఆయన భావించి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇపుడు వైసీపీలో చాలా మంది పెద్దలు తమకు ఇచ్చిన పెద్ద అవకాశాలను వాడుకుని జంప్ అవుతున్నారు. మరి ఇదే జగన్ అర్ధం చేసుకోవాలి. నేను అధినేతను వరాలు ఇస్తున్నాను అని పదవులు అధికారంలో ఉన్నపుడు పంచడం కాదు అపాత్రదానం చేస్తున్నామా అని చూసుకోవాలి. ఒకటికి పది సార్లు అన్నీ ఆలోచించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక సొంత ఊరు కన్న తల్లి అని అంటారు. అలా సొంత సామాజిక వర్గాన్ని కూడా అందలం ఎక్కించడం ఈ రోజులలో తప్పు కాదు, ఆ పని చేయకపోవడం వల్ల జగన్ రెండింటికీ చెడ్డారా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News