జగన్‌కు తెలిసే జరుగుతున్నాయా.. జంపింగుల ట్విస్ట్!
వైసీపీలో జంపింగుల వ్యవహారం.. కేవలం రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చగా మారాయి.
వైసీపీలో జంపింగుల వ్యవహారం.. కేవలం రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చగా మారాయి. సహజంగా రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ శాస్వత శత్రువులు కారు. ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు కూడా కారు. అవససరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే నాయకులు ప్రయాణాలు చేస్తారు. ఎక్కడ అవసరం ఉంటే.. ఎక్కడ అవకాశం తమను వరిస్తుందంటే.. అటు వైపు వెళ్లిపోతారు. పైగా.. ఇప్పుడున్న రాజకీయా ల్లో అయితే.. ఈ రెండు మరింత అవసరంగా మారిపోయాయి.
కేవలం నాయకులకు మాత్రమే కాదు.. పార్టీలకు కూడా.. జంపింగులు అవసరంగా మారాయి. ప్రత్యర్థుల ను మరింత బలహీన పరచడం కోసం.. పార్టీలు అనుసరిస్తున్న విధానాల్లో ఇది కీలకంగా మారింది. అయితే.. పార్టీలకు తెలియకుండా.. నాయకులు జంప్ చేస్తారా? అనేది ప్రశ్న. పైగా విస్తృతమైన నెట్ వర్క్.. బలమైన సామాజికవర్గం, మీడియా కూడా అండగా ఉన్న జగన్‌కు.. వైసీపీలో ఏం జరుగుతోందో తెలియకుండా ఉంటుందా? అనేది ప్రశ్న.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు జంప్ చేశారు. మరికొంత మంది కూడా.. ఇదే బాటలో ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో జగన్‌కు ముందస్తు సమాచారం లేకుండా ఉంటుందా? కనీసం ఆయన సొంత మీడియాకైనా తెలియదా? అంటే.. అన్నీ తెలుసుననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. అయితే.. ఎవరూ బయటకు రావడం లేదు. మోపిదేవి వెంకటరమణ వ్యవహారం.. ఎన్నికలకు ముందే జగన్ తెలుసునని చెబుతున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వనప్పుడే.. ఆయన.. టీడీపీతో చేతులు కలిపిన విషయం జగన్ మీడియాలో ప్రముఖంగా వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలోనూ.. ఆయన సైలెంట్‌గా ఉండడం.. పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు సహకరించిన విషయం కూడా జగన్‌కు తెలుసునని చెబుతున్నారు. ఇక, బీద మస్తాన్ రావే కాదు.. ఇతర నేతల వ్యవహారం కూడా.. జగన్‌కు ముందే తెలుసని.. ఆయనకు పక్కా సమాచారం ఉందని.. అందుకే.. ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇలాంటి వారిని ఆయన తన సమీక్షలకు ఆహ్వానించలేదని అంటున్నారు. కాబట్టి.. జగన్‌కు తెలియకుండా ఏమీ జరగలేదని.. అంతా ఆయనే చూసుకుంటారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.