ఐదేళ్లు అందర్నీ దూరం చేసి .. ఇప్పుడు !

ముఖ్యంగా నలుగురైదుగురు సలహాదారులు అధిక పెత్తనం చెలాయించి పార్టీని, ప్రభుత్వాన్ని అన్ని విధాలు భ్రష్టు పట్టించారని చెబుతున్నారు.

Update: 2024-06-17 05:13 GMT

151 శాసనసభ స్థానాలతో 2019లో ఘనంగా అధికారం అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి కేవలం 11 శాసనసభ స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకున్నది. అయితే ఐదేళ్లు పెత్తనం చెలాయించి అందరినీ జగన్ కు దూరం చేసిన సలహాదారులు వైసీపీ ఓటమి అనంతరం తాడేపల్లి నుండి బిచాణా ఎత్తేశారని, ఒక్కరు కూడా అక్కడ కనిపించడం లేదని వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతుంది.

సలహాదారులు పదవుల పేరుతో అనేక మందికి జగన్ ఉపాధి కల్పించాడు. వారు ఇచ్చిన సలహాలు ఏమిటో గానీ వారు చేసిన పెత్తనం మాత్రం పేను గొరిగిన చందంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా నలుగురైదుగురు సలహాదారులు అధిక పెత్తనం చెలాయించి పార్టీని, ప్రభుత్వాన్ని అన్ని విధాలు భ్రష్టు పట్టించారని చెబుతున్నారు.

ప్రజా ప్రతనిధులు మొదలుకుని, మంత్రుల వరకు అందరూ తమ కనుసన్నలలో నడిచేలా పెత్తనం సాగించారు. మంత్రులైనా, సీనియర్ నేతలైనా తాము చెప్పిందే వినాలి. తేడా వస్తే జగన్ పేరుతో బెదిరించే వారట. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా తాము రాసిచ్చిందే మాట్లాడాలి. అదనంగా ఏం మాట్లాడినా వారికి చుక్కలు చూయించేవారట.

ఇక ఓ సలహాదారుడు అయితే ఏ శాఖలో ఏం జరగాలన్నా, ఏ మంత్రి ఏం చేయాలన్నా తను చెప్పిందే ఫైనల్ అని సమాచారం. వైసీపీ ఓటమిలో ఇతనిదే ప్రధానపాత్ర అని చెబుతున్నారు. జగన్ ను కేవలం తాడేపల్లి ప్యాలేస్ కు పరిమితం చేయడంలో ఈ సలహాదారులదే ప్రధాన పాత్ర అని వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఐదేళ్లలో కేవలం రెండు, మూడుకు మించి మీడియా సమావేశాలు నిర్వహించనివ్వలేదని, తాము రాసిచ్చిన వాటిని చదవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా పరిమితం చేశారని, క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియనివ్వకుండా అంతా బాగుందనే నివేదికలతో నిండా ముంచారని వాపోతున్నారు. సాధారణ కార్యకర్తల నుండి అభిమానులు, అమాత్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరినీ జగన్ కు దూరం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు అధికారం పోయాక సలహాదారులు అందరూ తాడేపల్లిని వీడి కనిపించకుండా పోయారని అంటున్నారు.

Tags:    

Similar News