దావోస్ పర్యటన విమర్శలపై వైసీపీ సెటైర్ పీక్స్!

ఇందులో భాగంగా... "పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళితే.. జగన్ మాత్రం డుమ్మా కొట్టారు

Update: 2024-01-17 08:13 GMT

ఏటా స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు మనదేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటుంటారనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమయంలో టీడీపీ అనుకూల మీడియాగా పేరున్న పత్రికలో జగన్ దావోస్ పర్యటనకు వెళ్లకపోవడంపై స్పందించింది!

ఇందులో భాగంగా... "పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళితే.. జగన్ మాత్రం డుమ్మా కొట్టారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పెట్టుబడులు తీసుకొచ్చే మంచి అవకాశాన్ని వదిలేశారు. ఇంట్లోనే కూర్చుని సంక్రాంతి సంబరాల్లో ప్రతిపక్ష నేతలను తిట్టించి కాలక్షేపం చేశారు. అంటూ రాసుకొచ్చింది"! దీనిపై వైసీపీ ఆన్ లైన్ వేదికగా కౌంటర్ వేసింది. ఇదే సమయంలో గతంలోని దావోస్ పర్యటనల వివరాలను నెట్టింట వైరల్ చేస్తుంది.

అవును... దావోస్ పర్యటనకు జగన్ వెళ్లకపోవడాన్ని తప్పుబడుతున్నవారికి ఉమ్మడిగా రిప్లై ఇచ్చింది వైసీపీ. ఇందులో భాగంగా... ఏటా కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు అండ్ పార్టీ చేసిన దావోస్ టూర్లు, అక్కడి చిత్రాలు, విన్యాసాలు, విలాసాలు, ఫోటో షూట్ల యవ్వారాలు ప్రజలందరికీ తెలుసని తెలిపింది.

ఇదే సమయంలో... అన్నేళ్లలో వందలకోట్లు తగలేయడం తప్ప ఒక్క విదేశీ పెట్టుబడిని కూడా సాధించలేదని గుర్తుచేసింది! ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ కేవలం విశాఖ గ్లోబల్ సదస్సులోనే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించారని తెలిపింది. ఈ సందర్భంగా... మీకు పబ్లిసిటీ, బిల్డప్పులు అవసరం.. మాకు ఫలితాలు అవసరం.. మీది మాటల ప్రభుత్వం.. మాది చేతల సర్కారు అని ముగించింది.

కాగా... స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో ఏర్పాట‌య్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు 2019లో వెళ్లిన చంద్రబాబు & కో చేసిన ఖర్చు అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగురోజుల టూర్ లో భాగంగా... ఏపీ ప్రతినిధుల బృందం దావోస్‌ లో 14 కోట్ల రూపాయ‌ల మేర వ్యయం చేశార‌ని అప్పట్లో కథనాలొచ్చాయి!

ఇదే సమయంలో... 2019లో ఏపీ బృందం దావోస్‌ లో తీసుకున్న లాంజ్ అద్దె ఖ‌ర్చే 2 కోట్ల 48 లక్షలుగా తేలగా... అందులో కంప్యూటర్లు అమ‌ర్చడానికి, సోపాలు ఏర్పాటు చేయ‌డానికి మ‌రో 2 కోట్ల 51 ల‌క్షల రూపాయ‌ల బిల్లును వేయగా... ఈ బృందం నాలుగు రోజుల భోజనాల ఖర్చు కోటి ఐదు లక్షల రూపాయ‌లు కావడం గమనార్హం!

Tags:    

Similar News