ఢిల్లీలో హంగ్...పార్టీలకు ఖంగ్ ?
ఆప్ లో కూడా వర్గ పోరు అధికార పార్టీలో ఉండాల్సిన జాడ్యాలు అన్నీ కూడా కలగలిసి చీపురు పార్టీకి కొత్త భారాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.
మరో పది రోజులలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం డెబ్బై స్థానాలు ఉండే శాసనసభకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతోంది. అదే నెల 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈసారి ఢిల్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.
అధికారంలో ఉన్న ఆప్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మధ్యలో కాంగ్రెస్ కూడా చేరింది. ఆ పార్టీకి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి బలం ఉంది. పదిహేనేళ్ళ పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ కి కొన్ని వర్గాలలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది.
దాంతో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో త్రిముఖ పోరు సాగుతోంది. కాంగ్రెస్ ఈ భీకరమైన పోరులో గెలుస్తుందా అంటే ఏమో తెలియదు కానీ ఆ పార్టీ ఓట్లు గణనీయంగా పట్టుకుని పోతే అది అంతిమంగా ఆప్ అధికారానికి చేటు తెస్తుంది అని అంటున్నారు.
ఇక బీజేపీ విషయం తీసుకుంటే 2020 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈసారి బలాన్ని బాగా పెంచుకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అన్న ప్రచారం ఈసారి ఢిల్లీ వీధులలో మారు మోగుతోంది. దాంతో గతం కంటే బీజేపీకి ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అయితే అది అధికారం దక్కించుకేటంతగా ఉంటుందా అన్నది చర్చగా ఉంది.
ఇక ఆప్ గత పన్నెండేళ్ళుగా నాన్ స్టాప్ గా అధికారంలో ఉంది. ఆ పార్టీ విషయంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు ఈసారి ఆప్ కి బదులుగా బీజేపీని ఎన్నుకోవాలని భావిస్తున్న వర్గాలు పెరిగాయని చెబుతున్నారు. కేజ్రీవాల్ క్రేజ్ కూడా గతంతో పోలిస్తే తగ్గుతోంది.
ఆప్ లో కూడా వర్గ పోరు అధికార పార్టీలో ఉండాల్సిన జాడ్యాలు అన్నీ కూడా కలగలిసి చీపురు పార్టీకి కొత్త భారాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. అయితే గతంలో దక్కిన 60కి పైగా సీట్లు ఈసారి దక్కకపోయినా సగానికి సగం అయినా ఆప్ కి వస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే కనుక జరిగితే మాత్రం ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 36 సీట్లు ఏ పార్టీకి దక్కే సూచనలు ఉండవని అంటున్నారు. అపుడు హంగ్ రావచ్చు అని చెబుతున్నారు. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. అయితే ఆప్ కి ఏ ముప్పయి సీట్లో దక్కి కాంగ్రెస్ కి ఆరేడు సీట్లు దక్కినా ఆప్ కాంగ్రెస్ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అని అంటున్నారు.
అదే సమయంలో బీజేపీకి మాత్రం హంగ్ వస్తే ఆ చాన్స్ అసలు ఉండదని అంటున్నారు. బీజేపీ కచ్చితంగా 36 సీట్లకు పైగా తెచ్చుకుంటేనే అధికార పీఠం ఎక్కగలదు. మరి కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం మార్చడానికి తగిన భూమికను పోషిస్తోంది. కాంగ్రెస్ తాను బలపడి కొన్ని సీట్లు సాధిస్తే అది ఆప్ కి సహాయంగా ఎన్నికల తరువాత మారవచ్చు. అలా కాకుండా తాను గెలవకుండా ఓట్లు భారీగా చీలిస్తే మాత్రం అది బీజేపీకి ప్లస్ అవుతుంది. అపుడు ఆప్ అధికారానికి దూరం అవుతుంది అని అంటున్నారు. ఈ విధంగా ఢిల్లీ రాజకీయ సమీకరణలు ఉన్న నేపథ్యంలో హంగ్ వస్తే ఎవరు ఖంగు తింటారో అన్నది చర్చగా ఉంది.