ఉత్తరాఖండ్ లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి... ఎందుకు ముద్దు, మరెందుకు వద్దు?
యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి - యూసీసీ) అంటే... యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే సంగతి తెలిసిందే.
యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి - యూసీసీ) అంటే... యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో ఒకటే పౌరచట్టం లేదు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయ్యి.. అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.
అవును... 'యూసీసీ'పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోను ఈ యూసీసీ ఉండాలని నిర్దేశించారు. 44 ఆర్టికల్ ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి కానీ.. ఇది స్వచ్ఛందంగా రావాలి అని అభిలాషించారు. ఈ సమయంలో ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో నేటి (జనవరి 27 - 2025) నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దీంతో... దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన సీఎం... యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని.. పౌరులందరికీ సమానమైన హక్కులతో పాటు బాధ్యతలు దక్కేలా చూస్తామని తెలిపారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందులో కీలక అంశాలు ఇలా ఉన్నాయి!
ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మతాలతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, వీలునామాలు, దత్తత మొదలైన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. ఇదే సమయంలో... ఉత్తరాఖండ్ లో సహ జీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. వీరంతా ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో ఇకపై ఉత్తరాఖండ్ లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అదేవిధంగా... అన్ని మతాల్లోనూ బహుభార్యత్వాన్ని, హలాల్ విధానాన్ని నిషేధించారు.
ఎందుకు ముద్దు..?
యూసీసీ ని కొంతమంది బలంగా సమర్ధిస్తున్నారు. ఈ సందర్భంగా.. పౌరస్మృతితో మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తుందన్నది దాన్ని సమర్థించేవారి వాదనగా ఉంది. దీనివల్ల పర్సనల్ చట్టాల్లోని వివక్ష పోయి.. స్త్రీ-పురుష సమానత్వం సాధ్యం అవుతుందని అంటారు.
ఎందుకు వద్దు..?
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. ఇకపై మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. అంటే.. వివిధ మతాలను అనుసరించే, ఆయా మతాలకు సంబంధించిన చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లవుతుందనేది దీన్ని వ్యతిరేకించేవారి వాదన. యూసీసీ అమల్లోకి వస్తే దేశంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మైనారిటీలు అభద్రతకు లోనవుతారని, మత స్వేఛ్చకు విఘాతం కలుగుతుందనేది వారి ఆందోళన!