విజయసాయిరెడ్డి పోస్ట్ కోసం చెవిరెడ్డి ?
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డిని తిరిగి నియమించడం పట్లనే ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ వైసీపీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారని అప్పట్లో టాక్ నడచింది.
వైసీపీలో నెంబర్ టూగా ఒకనాడు ఉన్న వి విజయసాయిరెడ్డి రాజకీయాలకు స్వస్తి అనేశారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయన అనూహ్యంగా ఈ ప్రకటన చేయడంతో వైసీపీ వర్గాలు అన్నీ షాక్ తిన్నాయి. అయితే అదే సమయంలో వైసీపీలో అయితే కొత్త రకం చర్చ మొదలైంది.
విజయసాయిరెడ్డి ప్లేస్ ని ఎవరు చేరుకుంటారు అని. ఇప్పటికి అయితే వైసీపీ హైకమాండ్ కి క్లోజ్ గా ఉన్న వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి వంటివారు ఉన్నారు. అయితే తిరుపతి జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయిరెడ్డి ప్లేస్ లోకి రావాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఆయన వైసీపీలో ఇటీవల కాలంలో జగన్ కి బాగా అత్యంత సన్నిహితులుగా మారారు. ఆయనను తెచ్చి ఒంగోలు ఎంపీ సీటుకు గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేయించారు జగన్. ఇక ఆయనకు ఆయా జిల్లాల పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే చెవిరెడ్డి చూపు ఇపుడు ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉంది అని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీని వెనక ఆయనకు విశాఖలో బిజినెస్ లావాదేవీలు చూసుకోవాలని ఉందని మరో ప్రచారం కూడా సాగుతోంది.
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డిని తిరిగి నియమించడం పట్లనే ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ వైసీపీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారని అప్పట్లో టాక్ నడచింది. ప్రత్యేకించి సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు అయితే బీసీల జిల్లాలో వేరే వారి రాజకీయ పెత్తనం తగదన్నట్లుగా భావిస్తూ వచ్చారని అనుకున్నారు.
ఇపుడు ఎటూ విజయసాయిరెడ్డి పార్టీలో లేరు కాబట్టి సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న బొత్సకు ఈ చాన్స్ దక్కుతుందని అనుకుంటున్నారు. ఆయననే ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తే బలమైన బీసీ నేతగా ఆయన వల్ల పార్టీకి మేలు జరుగుతుందని అంటున్న వారు ఉన్నారు.
రాజకీయ సామాజిక పరిస్థితులు సమీకరణలను దృష్టిలో ఉంచుకుంటే ఇదే కరెక్ట్ అని అంటున్న వారూ ఉన్నారు. అయితే దీని మీద వైసీపీ హైకమాండ్ ఏమి ఆలోచిస్తుందో తెలియదు కానీ చెవిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం వద్ద ఉన్న పలుకుబడికి ఆయన కనుక ఈ పదవి కోరుకుంటే నో అన్న మాట చెప్పేది ఉండదని అంటున్నారు.
అపుడు చెవిరెడ్డికే ఈ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఉత్తరాంధ్రా పార్టీ రాజకీయాల మీద పెట్టారని దాంతో మరో రెడ్డికే అవకాశం ఇస్తే వైసీపీలో ఉన్న సీనియర్లు ఎలా రియాక్టు అవుతారు అన్నది కూడా కీలకమైన చర్చగా ఉంది.
వైసీపీలో ఇపుడు బొత్స సత్యనారాయణ బలమైన నేతగా ఉన్నారు. ఆయన కౌన్సిల్ లో అపోజిషన్ లీడర్ గా కేబినెట్ హోదాతో ఉన్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వకపోతే ఆయన కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి సైతం వెనకాడరు అని అంటున్నారు. ఆయన ఇప్పటికే అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.
బొత్స రాజకీయ వ్యూహాలను కూడా తక్కువ చేయడానికి వీలు లేదని అంటున్నారు. ఇక బొత్స లాంటి వారు కనుక పార్టీ నుంచి వెళ్ళిపోతే అపుడు వైసీపీ మీద మరింత భారం పడుతుందని రాజకీయంగా అది ఎనలేని నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. అందువల్ల ఎక్కడో రాయలసీమ జిల్లాలకు చెందిన చెవిరెడ్డిని ఉత్తరాంధ్రా మీద రాజకీయం చేయడానికి పదవి ఇస్తే అది వైసీపీ అధినాయకత్వం తానుగా చేసుకున్న మరో మహా అపరాధం అవుతుందనే అంటున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.