వృత్తి గొర్రెల వ్యాపారం.. ప్రవృత్తి దొంగనోట్ల వ్యాపారం

రోజూ గొర్రెలను కాస్తూనే తన మాఫియాను నడుపుతున్న ఆ మహా ముదరు తెలంగాణ పోలీసులకు అనుకోకుండా దొరికిపోయాడు.

Update: 2025-01-29 00:30 GMT

అతడు చూడటానికి గొర్రెల కాపరిలా కనిపిస్తాడు. రోజూ అడవికెళ్లి గొర్రెలను మేపుతాడు. ఏపుగా పెరిగిన గొర్రెలను విక్రయించి కుటుంబాన్ని పోషిస్తుండగా, అందరికీ అతడి కోసం అదే తెలుసు. కానీ, ఓ మాఫియాకు అతడే డాన్ అని.. ప్రభుత్వానికి పోటీగా దొంగనోట్లు అచ్చేసి రాష్ట్రం మొత్తం చెలామణీ చేస్తాడని ఎవరికీ తెలియదు. రోజూ గొర్రెలను కాస్తూనే తన మాఫియాను నడుపుతున్న ఆ మహా ముదరు తెలంగాణ పోలీసులకు అనుకోకుండా దొరికిపోయాడు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 8 మంది సభ్యుల గల దొంగనోట్ల ముఠా గుట్టు రట్టైంది. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారించడంతో దొంగనోట్లు చలామణీ చేస్తున్న భారీ ముఠా గుట్టు బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ గొర్రెల కాపరి అని.. అతడిపై ఇది వరకు నాలుగు కేసులు ఉన్నాయని తెలుసుకుని ఆశ్యర్యపోయారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ప్రధాన నిందితుడు తన దొంగ బుద్ధిని మానుకోకపోవడం ఆశ్యర్యం కలుగుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మణికాల క్రిష్ణ గొర్రెలు కాస్తుంటాడు. వాటితో వ్యాపారం చేస్తుంటారు. దీంతో వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని దొంగనోట్ల వ్యాపారం మొదలుపెట్టాడు. తెల్లకాగితాలపై కరెన్సీని ముద్రిస్తూ మార్కెట్లో చలమాణి చేస్తున్నాడు. ఇందుకోసం తన మాస్టర్ మైండ్ వాడాడు. అడవిలో ఓ డ్రమ్ము నిండా డబ్బు దొరికిందని, ఆ డబ్బు ఉపయోగిస్తే కుటుంబంలో జబ్బులు వస్తున్నాయని తెలిసిన వారిని నమ్మించేవాడు. తనకు లక్ష ఇస్తే డ్రమ్ములో ఉన్నడబ్బులో నాలుగు లక్షలిస్తానని ఆశ పెట్టేవాడు. ఇలా కరీంనగర్ జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాసుకు ఎరవేశాడు.

నిందితుడు మణికాల క్రిష్ణ మాటలను నమ్మిన ఎర్రగొల్ల శ్రీనివాస్ డబ్బును చూపమని కోరితే, పాల్వంచ అడవిలో తీసుకువెళ్లి నకిలీ కరెన్సీ ఉన్న డ్రమ్మును చూపారు. అయితే నగదును తన ఇంటికి తెచ్చిస్తేనే తాను డబ్బు ఇస్తానని ఆయన మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో అందుకు అంగీకరించారు. ఎర్రగొల్ల శ్రీనివాస్ కోరిక మేరకు డబ్బును హన్మకొండకు తరలించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో నిందితుడు క్రిష్ణ మరో ఏడుగురి సహకారం తీసుకున్నారు. వీరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపడింది.

కేసు విచారణలో పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు క్రిష్ణ బయటకు అమాయకంగా కనిపిస్తూ భారీ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెల్ల కాగితాలపై 500 రూపాయలను ముద్రించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలామనీ చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా అతడిపై గతంలో సత్తుపల్లి, బంజర, లక్ష్మీదేవిపేట పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయినా నిందితుడి బుద్ధి మారలేదు. తాజా కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ఏడుగురిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.34 లక్షల రూపాయల అసలు కరెన్సీతోపాటు రూ.21 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నోట్లు ముద్రించేందుకు వాడుతున్న సామగ్రిని సీజ్ చేశారు.

Tags:    

Similar News