మోడీ కంటే కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్న మమత
పైపెచ్చు ఉత్తర భారతం బెల్ట్ లో బీజేపీ బలహీనపడడం కలసి వస్తుందని అంచనా కట్టారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరి ఎనిమిది నెలలు అవుతోంది. 2024 ఎన్నికలు నిజంగా దేశంలో కాక పుట్టించేలా సాగాయి. వరసగా రెండు సార్లు గెలిచిన మోడీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇండియా కూటమికి ప్లస్ అవుతుందని అంతా భావించారు. పైపెచ్చు ఉత్తర భారతం బెల్ట్ లో బీజేపీ బలహీనపడడం కలసి వస్తుందని అంచనా కట్టారు.
కానీ ఫలితాలు వేరేలా వచ్చాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కలేదు కానీ ఎన్డీయే మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని మోడీ ఏర్పాటు చేసారు. చాకచక్యంగా ప్రభుత్వాన్ని నడుపుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరసగా పశ్చిమ బెంగాల్ లో మూడు సార్లు గెలిచి తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల మీద తనదైన విశ్లేషణ చేస్తూ మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ పుస్తకాలలో ఆమె నేరుగా కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు మోడీ విజయాల వెనక కాంగ్రెస్ ఉందని ఆమె సంచలన ఆరోపణలే చేశారు. ఇండియా కూటమి సమర్ధంగా ఐక్యంగా 2024 ఎన్నికల్లోఎన్డీయేని ఎదుర్కోలేకపోయిందని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లనే ఇండియా కూటమి ఓడి నరేంద్ర మోడీ అధికారంలోకి రాగలిగారు అని ఆమె ఆక్షేపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు అన్నీ కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఒకరి మీద ఒకరు పోటీ చేసి బీజేపీకి ఎంతో మేలు చేశారని ఆమె విమర్శించారు. ఈ రకమైన చర్యలు అన్నీ బీజేపీకి ఎంతో బాగా కలసి వచ్చాయని ఆమె అన్నారు.
ఇక పోతే ఇండియా కూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు చేసే పరిస్థితి కానీ ఉమ్మడి మేనిఫేస్టోని కార్యరూపం దాల్చేలా చేసే ప్రయత్నం కానీ లేదని మమతా బెనర్జీ గట్టిగా ఏకి పారేశారు. ఇలా బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అతి ముఖ్య పాత్ర పోషించింది అని ఆమె ఆరోపించారు.
ఇక చూస్తే కనుక మమతా బెనర్జీ చాలా కాలంగా కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఒంటెద్దు పోకడలు పోతోంది అన్నది మమతా బెనర్జీ ఆరోపణగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలోని ఇతర పార్టీలను గౌరవించడం లేదని ఆమె అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఇండియా కూటమిని సారధ్యం వహించాలని మమతా బెనర్జీకి ఉందని అంటున్నారు. అయితే ఆమెకు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ తానే కీలక పాత్రలో ఉంటోంది అన్న ఆగ్రహం ఆమెకు ఉంది. బీజేపీని కట్టడి చేయాలీ అంటే దూకుడు రాజకీయం అవసరమని మమత భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను గౌరవిస్తూ వారి రాజకీయ అవకాశాలను పెంచేలా చూడాలని అవసరమైన చోట తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని కూడా మమతా బెనర్జీ వంటి వారు సూచిస్తున్నారు.
అయితే జరుగుతున్నది వేరేగా ఉంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ బరిలోకి దిగడాన్ని మమతా బెనర్జీతో సహా ఇండియా కూటమి పార్టీలు అన్నీ తప్పు పడుతున్నాయి. అదే విధంగా చూస్తే కాంగ్రెస్ ని ఒంటరిని చేసి ఇండియా కూటమి పార్టీలు ఆప్ కే మద్దతుని ప్రకటించాయి.
ఈ పరిణామం ఇండియా కూటమి బలహీనతలను చాటి చెబుతోంది. దానికి తోడు అన్నట్లుగా మమతా బెనర్జీ తాజాగా చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఇపుడు ఇండియా కూటమిలో అగ్గి రాజేసేలా ఉన్నాయని అంటున్నారు. బీజేపీని కాంగ్రెస్ గెలిపిస్తోంది అన్న మమతా బెనర్జీ చేసిన ఆరోపణల మీద కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.