టీడీపీలో అసంతృప్తితో రగులుతున్న మాజీ మంత్రి ?
పదవులే రాజకీయంగా మారాయి. గెలిస్తే పదవి ఖాయంగా దక్కాలి. ఇక ఎన్ని సార్లు మంత్రి పదవిని అనుభవించినా మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి.
పదవులే రాజకీయంగా మారాయి. గెలిస్తే పదవి ఖాయంగా దక్కాలి. ఇక ఎన్ని సార్లు మంత్రి పదవిని అనుభవించినా మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి. ఇదే వర్తమానంలో నాయకుల టార్గెట్ గా ఉంది. దాంతో ఏ పార్టీ అయినా అందరికీ అందలాలు అందించలేక ఇబ్బందుల పాలు అవుతోంది.
టీడీపీలో చూస్తే కనుక సీనియర్లు జూనియర్లు చాలా మంది ఉన్నారు. ఈసారి టీడీపీ 134 సీట్లలో గెలిచింది. ఇలా గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారిలో అతి కొద్ది మంది తప్ప దాదాపుగా తొంబై శాతం మందికి మంత్రి పదవుల మీద ఆశలు ఉన్నాయి. అయితే కూటమితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టీడీపీకి 20 మంది మంత్రులే వచ్చారు. అందులోనూ కొత్తవారికి తొలిసారి గెలిచిన వారికి ఈసారి చాన్స్ ఇచ్చారు. దాంతో ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఉన్న సీనియర్ నేతలు చాలా మంది అమాత్య కిరీటాలను అందుకోలేకపోయారు
దాంతో సహజంగానే చాలా మందిలో అసంతృప్తి అయితే ఉంది. ఇక కొందరు అయితే ఎన్నికల ముందు వేరే పార్టీల నుంచి మారి టీడీపీ సైకిలెక్కారు. దాంతో వారు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి పక్కా అని లెక్క వేసుకున్నారు. కానీ జరిగింది వేరు కావడంతో తట్టుకోలేకపోతున్నారు.
అలా చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ మోస్ట్ నేత పలు పార్టీలు మారి 2024 ఎన్నికలలో టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన నాయకుడు మంత్రి పదవి దక్కలేదని చాలా బాధలో ఉన్నారట. ఆయన గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండేవారు. ఆ పార్టీలో అనేక దఫాలుగా మంత్రిగా పనిచేసి ప్రాధాన్యత కలిగిన శాఖలు చూసేవారు.
ఆయన రాజకీయ సుడి గత పదేళ్ళుగా బాగా లేక అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన గెలిచి వచ్చారు. తీరా చూస్తే మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన దశాబ్దకాలంగా అనుభవిస్తున్న మంత్రి పదవీ వియోగం కంటిన్యూ అవుతోంది. అది చివరికి భరించరాని బాధగా మారుతోందిట.
ఇక ఆయన తన సొంత నియోజకవర్గాన్ని సైతం తన వారికి వదిలేసి పూర్తిగా మౌనంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఆ నియోజకవర్గంలో అనుచరులు సహచరులు చేస్తున్న దందాలు మితిమీరుతున్నాయని హై కమాండ్ కి మేసేజులు వెళ్ళాయి. దాంతో సరిగ్గా చూసుకోమని పెద్దల నుంచి అలెర్ట్ చేసే విధంగా సూచనలు వచ్చాయట.
దాంతో సదరు మాజీ మంత్రి గారు మరింత మండుతున్నారని అంటున్నారు. ఎటూ పదవి లేదు, ఈ రకమైన హెచ్చరికలు ఏమిటి అని ఆయన తన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారుట. అయితే సీనియర్లకు టీడీపీలో సీన్ పెద్దగా లేదని సదరు మాజీ మంత్రికి ఇప్పటికీ అర్థం కాలేదా అన్న చర్చ కూడా నడుస్తోందిట. చాలా మందికి అవకాశాలు లేవని అలాంటపుడు ఒక్క ఆయనకే అన్యాయం జరిగింది అని ఎందుకు బాధపడడం అని అంటున్నారు పార్టీ నేతలు.
ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించి ఇచ్చిన ప్రజా ప్రతినిధి అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకుని తన వంతుగా మంచి పనులు చేస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా విస్తరణలో అవకాశం దక్కవచ్చు కదా అని మరికొందరు అంటున్నారుట. ఏది ఏమైనా సీనియర్ల అలకల వల్ల వారికే ఇబ్బందులు అని కూడా హితైషులు అంటున్నారుట.