నామినేటెడ్ పోస్టుకు 100 శాతం న్యాయం చేస్తోంది ఆయనేనా?

అయితే వీరిలో దాదాపు అందరూ తమ బాధ్యతలను స్వీకరించినా, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ, ఒకే ఒక్కడు మాత్రం తన పదవికి వంద శాతం న్యాయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2025-01-30 13:30 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో 79 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించారు. తొలి విడత 20 కార్పొరేషన్లు, రెండో విడతలో 59 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమితులయ్యారు. అయితే వీరిలో దాదాపు అందరూ తమ బాధ్యతలను స్వీకరించినా, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ, ఒకే ఒక్కడు మాత్రం తన పదవికి వంద శాతం న్యాయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఒక్కడే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీ.వీ.రెడ్డి. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ అధికార ప్రతినిధి తన స్వరాన్న సమర్థంగా వినిపించిన జీవీ రెడ్డి, ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. అధినేత చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు.

రాష్ట్రంలో దాదాపు వందకు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కార్పొరేషన్లు కొన్నే. అలాంటి వాటిలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అగ్రస్థానంలో ఉంటుంది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ స్థాపించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి బ్రాడ్ బాండ్ సేవలు అందించాలనేది ఈ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం. 2019కు ముందే రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవలను విస్తరించారు. తక్కువ ఖర్చుతో టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పించారు. ప్రజల ఆదరణ చూరగొన్ని ఫైబర్ నెట్ 2019 తర్వాత పేలవ పనితీరుతో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు దివాళా అంచుకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డి మళ్లీ గాడిలో పెడుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్న పలు అంశాలపై చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, అప్పటి ప్రభుత్వం ఆయనపై ఫైబర్ నెట్ స్కాంకు పాల్పడ్డారని కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు తగిన ఆధారాలు లేవని పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు కొట్టివేసింది. దీనిపై ఓ పత్రిక కథనాలు ప్రచురిస్తే చైర్మన్గా తన వాణి సమర్థంగా వినిపించారు జీవీ రెడ్డి. అంతేకాకుండా అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరే తప్పుడు కేసు నమోదు చేశారని, వారిపై తిరిగి సీఐడీ కేసు నమోదు చేయాలని కోరుతూ అధినేత మనన్నలు అందుకుంటున్నారు.

దాదాపు దివాళా అంచుకు చేరిన ఫైబర్ నెట్ ను తిరిగి నిలబెట్టడంలో ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటున్నారు జీవీ రెడ్డి. ముందుగా అడ్డుగోలు నియామకాల ద్వారా సంస్థలో చేరిన ఉద్యోగులను ఏరిపారేశారు. ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ఉద్యోగాల్లో చేరిన దాదాపు 600 మందిని ఒకేసారి తొలగించి స్పీడ్ చూపించారు. కూటమి ప్రభుత్వంలో 79 మంది చైర్మన్లు ఉండగా, ఎవరూ కూడా జీవీ రెడ్డిలా ఇంత వేగంగా, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని ఆ పార్టీలో వినిపిస్తోంది.

ఒకవైపు సంస్థలో ఉద్యోగులను తొలగించి ఆర్థికభారం తగ్గించుకోవడంతోపాటు గత ప్రభుత్వంలో అధిక మొత్తం వసూలు చేసిన వ్యూహం సినిమా నిర్మాతల నుంచి తిరిగి ఆ డబ్బు వసూలు చేయడానికి నోటీసులు జారీ చేయడం వరకు జీవీ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేషన్లో తన ముద్ర స్పష్టంగా ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఫైబర్ నెట్ అందిస్తున్న ప్లాన్ రివైజ్ చేయడంతోపాటు, దేవాలయాలకు ఉచితంగా కనెక్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా మూలకు చేరిన ఫైబర్ నెట్ సంస్థకు జీవం పోయడంతోపాటు వ్యక్తిగతంగా తన సమర్థత చాటుకుంటున్న జీవీ రెడ్డి.. ఒకేఒక్కడుగా నిలుస్తున్నాడు. అధినేత చంద్రబాబు ఆశీస్సులతో ఆయన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చడంతోపాటు సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారని అభినందనలు అందుకుంటున్నారు.

Tags:    

Similar News