అమెరికా విద్యార్థి వీసాల్లో మార్పులు... ఆ 7,000 మంది ఇండియన్స్ ఎక్కడ?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ అక్రమ వలసదారులపై కీలకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ అక్రమ వలసదారులపై కీలకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అక్రమ వలసదారులను వారి వారి స్వదేశాలకు మిలటరీ విమానాల్లో పంపించేసిన ట్రంప్.. మరికొంతమందిని మాత్రం జైలుకు పంపించారు. ఈ సమయంలో ఇప్పుడు విద్యార్థులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అవును... అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. దీనిపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సమయంలో చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. భారత్ తో పాటు దాదాపు 32 దేశాలకు చెందిన విద్యార్థులు విద్యార్థులు వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెస్సీకా ఎం.వాఘన్.. 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్ ఛేంజ్ విజిటర్లు 2023లో వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్నారని చెబుతూ.. ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్.ఎం. వీసాలు పొందినవారు అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... బ్రెజిల్, కొలంబియా, చైనా, భారత్ దేశాలకు చెందిన విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని.. వీరిలో అత్యధికంగా భారతీయుల సంఖ్య 7,000గా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో.. మారుమూల ప్రాంతాలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియన్ ఎన్ ఫోర్స్ మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని అన్నారు.
ఈ సమయంలో... చదువు పూర్తయిన తర్వాత ప్రతీ విద్యార్థి స్వదేశానికి వెళ్లటానికి సిద్ధంగా ఉండాలని జెస్సికా ఎం. వాఘన్ వెల్లడించారు. ఇదే సమయంలో... హెచ్-1బీ వీసాలకు రెండేళ్ల గడువు మాత్రమే ఉండాలని జెస్సికా పేర్కొన్నారు.. వీటిని అవసరాన్ని బట్టి నాలుగేళ్లకు పొడిగించుకొనేలా అవకాశం ఇవ్వాలని తెలిపారు.
అయితే... గ్రీన్ కార్డ్ పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్ గా పొడిగింపులు లభించకూడదని కమిటీకి సూచించారు. ఇదే సమయంలో.. ప్రస్తుతం అపరిమితంగా ఉన్న రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000లోపే ఉండాలని అన్నారు.
కాగా.. అమెరికా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీల్లో పూర్తిస్థాయి విద్యార్థిలా చదువుకునేందుకు ఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. వృత్తివిద్యా కోర్సులు, నాన్ అకడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్ లకు ఎఫ్-1 వీసాలు వాడతారు. ఇప్పుడు ఈ వీసాలు పొందినవారు అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.