ఉత్తరాంధ్రలో వైసీపీకి బొత్స.. మరి టీడీపీకి..?

ఇదే సమయంలో అధికార టీడీపీలో ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసే నేత కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది.

Update: 2025-01-30 15:30 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో ముఖ్యనేతలకు మంచి పదవులే దక్కాయి. ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేవలం రెండు సీట్లే గెలిచిన వైసీపీ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర నేత బొత్సకు కీలక పదవి అప్పగించింది. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన బొత్స వైసీపీలో ప్రస్తుతం క్యాబినెట్ హోదా అనుభవిస్తున్న ఏకైక నేత. పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. పార్టీ ఓడిపోయిందనే నైరాశ్యం నుంచి క్యాడర్ ను బయటకు తీసుకువచ్చేందుకు అనుక్షణం తపిస్తున్నారు. ఇదే సమయంలో అధికార టీడీపీలో ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసే నేత కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర రాజకీయాలకు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ కు చాలా తేడా ఉంటుంది. ఈ ప్రాంతంలో రాజకీయం ఎన్నికల వరకే పరిమితం. అదే సమయంలో శాంతి, సామరస్యం స్థానిక రాజకీయాల్లో ఉంటుంది. నేతల మధ్య సంబంధాలు కూడా ఆరోగ్యకరంగానే ఉంటాయ. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో నేతలు ఎవరికి వారు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రస్థాయి నేతలుగా ఎందరో గుర్తింపు తెచ్చుకున్నారు. అధికార పార్టీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలా చాలా మంది నేతలు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదిగారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకు ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లా వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించేవారు. ఈ ప్రాంతంలో రాజకీయంగానైనా, అభివృద్ధిపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలైనా అశోక్ కనుసన్నల్లోనే జరిగేవి. ఎవరికి ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలన్నా అశోక్ గజపతి దృష్టిలో పెట్టే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునేవారు. కానీ, అశోక్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యాక ఆ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నేతలు ఎవరికి వారే అన్నట్లు తయారైంది.

ఇక ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఉత్తరాంధ్ర బాధ్యతలను మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్సకు అప్పగించింది. పార్టీ పరంగా ఉత్తరాంధ్ర కో ఆర్డినేటరుగా ఎవరు ఉన్నా, ఇక్కడ బొత్స మాటకే ఎక్కువ విలువ ఇస్తోంది. ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా, ప్రస్తుతం బొత్స స్థాయిలో ఎవరూ యాక్టివ్ గా పనిచేయడం లేదు. మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. ధర్మాన క్రిష్ణదాస్ తన జిల్లాకే పరిమితమవుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటివారు పార్టీ వాయిస్ ను సమర్థంగా వినిపించగలరు కానీ, బొత్సను మించి రాజకీయం చేయలేరన్న వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర బాస్ గా బొత్స చలామనీ అవుతున్నారు.

అయితే బొత్స ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రను ఓ యూనిట్ గా చేసుకుని వైసీపీ రాజకీయం చేస్తుండగా, అధికార పక్షంలో ఆ దిశగా ఆలోచన చేయడం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం పర్యవేక్షించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ రాజకీయ విశ్రాంతి తీసుకోవడం ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది. సౌమ్యుడు, వివాద రహితుడిగా అశోక్ గజపతికి పార్టీలో ఎంతో గౌరవం ఉండేది. అధినేత మాట తర్వాత అశోక్ ఏం చెప్పినా టీడీపీలో అంతే విలువ ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక అయ్యన్నపాత్రుడు అందరికన్నా సీనియర్. మాస్ లీడరుగా అచ్చెన్నాయుడు, మాస్ అండ్ క్లాస్ లీడరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎవరికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినా బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విశాఖ నగరంపైనే ఉత్తరాంధ్ర రాజకీయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. అయితే ఈ విషయాన్ని చెప్పే బలమైన వాయిస్ కనిపించకపోవడం టీడీపీకి మైనస్ గా మారుతోంది. నేతలు ఎవరికి వారుగా మాట్లాడేకన్నా, అంతా ఓ గొడుగు కింద పనిచేస్తున్నామనే భావన కల్పించడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేత బొత్సకు దీటుగా టీడీపీ ఎవరిని రంగంలోకి దింపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News