వణికించే చలిలో అరకు అందాలు చూస్తారా ?

అరకు అంటేనే అందాలకు నెలవు అని చెప్పాలి. ప్రకృతి ఒడిలోకి చేరిన అనుభూతి కలుగుతుంది

Update: 2025-01-30 03:48 GMT

అరకు అంటేనే అందాలకు నెలవు అని చెప్పాలి. ప్రకృతి ఒడిలోకి చేరిన అనుభూతి కలుగుతుంది. రమణీయతకు మారుపేరుగా కళ్ళకు కట్టేసే సొగసుల గనిగా అరకు ప్రసిద్ధం అయింది. అరకులో ఆకట్టుకునే సోయగాలు ఎన్నో ఉన్నాయి. అరకుని చూడాలీ అంటే వణికించే చలిలోనే అని ప్రకృతి ప్రేమికులు చెబుతారు.

మంచు దుప్పటిని కప్పుకుని లేలేత భానుడి కిరణాలు సోకి ఇంద్ర ధనస్సు సొగసులను కళ్ళకు కట్టినట్లుగా చూపించే అరకు అంటే పర్యాటకులు నిండా మోజు పెంచుకుంటారు. అటువంటి అరకు అందాలను మరోమారు ప్రపంచవ్యాప్తం చేసేందుకు పర్యాటకులకు కనువిందు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అరకు ఉత్సవ్ ని నిర్వహిస్తోంది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అరకు ఉత్సవ్ ని నిర్వహించేవారు. వైసీపీ పాలనలో అయిదేళ్ళూ ఆ ఆనవాయితీని పాటించలేదు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో అరకు ఉత్సవ్ ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు అరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

అరకు ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేసింది. అబ్బురపరచే ప్రకృతి అందాలతో పాటు స్వచ్చమైన గిరిజన సంప్రదాయాలు సంస్కృతి సంపదను అంతా అరకు ఉత్సవంలో ఘనంగా చూపించేందుకు సిద్ధపడుతున్నారు. కేవలం అరకు ప్రాంతం గిరిజనుల సంప్రదాయాలను మాత్రమే కాకుండా దేశం నలుమూలల ఉన్న గిరిజనుల జీవన శైలి వారి కల్చర్ గురించి ఈసారి తెలియచేసే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

అలాగే అరకు ప్రాంతంలో కాఫీ తోటలు స్ట్రా బెర్రీ తోటలు ట్రైబల్ మ్యూజియం వంటివన్నీ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. పర్యాటకులు మధురానుభూతులను ఎన్నో మూటగట్టుకునేందుకు ఆహ్వానం పలుకుతూ ఈ ఉత్వవాలను నిర్వహిస్తున్నారు.

అరకులో అందాలను చూసేందుకు సాధారణ సమయాల్లోనే పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారు. ఈసారి ఉత్సవాల పేరిట మూడు రోజుల పాటు మరింత ముచ్చట గొలిపే విధంగా అనెక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చూస్తోంది. అరకుని టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దానికి ఊతమిచ్చే విధంగా ఈ ఉత్సవాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News