సబ్బం హరి నుంచి విజయసాయి వరకు.. మూలస్తంభాలే కూలిపోతున్నాయెందుకు?
పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాల్లో మార్పులు, చేర్పులు అత్యంత సహజం. రాజీనామాలు, రాజీ డ్రామాలు కూడా సహజం. కానీ, కొంతమంది చర్యలు మాత్రం విస్తృత చర్చకు దారితీస్తాయి. అలాంటి వారిలో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఒకరు. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సివచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒక్క విజయసాయిరెడ్డే కాదు వైసీపీలో చాలా మంది నేతలు ఇలా ఆకస్మాత్తుగా పార్టీ నుంచి తప్పుకున్నారు. కొందరు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెబితే, మరికొందరు ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే పార్టీకి ముఖ్యలుగా మూలస్తంభాలుగా నిలబడిన వారు తప్పుకోవడం, దీనికి ఆ పార్టీ అధిష్టానం పెద్దగా రియాక్ట్ కాకపోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వైసీపీలో విజయసాయిరెడ్డి నిష్క్రమణ పెను సంచలనం. పార్టీలో ఆయన నెంబర్ 2. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకంటూ వైసీపీని స్థాపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తూ 2011 మార్చి 12న వైఎస్ఆర్ సీపీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఆవిర్భవించిన వైసీపీలో జగన్ తోపాటు విజయసాయిరెడ్డి, షర్మిల, విజయమ్మ వ్యవస్థాపక సభ్యులు వీరు కాకుండా విశాఖ జిల్లాకు చెందిన సబ్బం హరి, కొణతాల రామక్రిష్ణ వంటివారు జగన్ వెన్నంటే నడిచి వైసీపీ ఆవిర్భావంలో కీలక భూమిక వహించారు.
ప్రస్తుతం వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న చాలా మంది నేతలు వైసీపీ ఆవిర్భావ సమయంలో లేరు. 2014 ఎన్నికలకు కాస్త ముందు కొందరు, ఆ తర్వాత మరికొందరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, విజయసాయిరెడ్డి అలా కాదు. జగన్ పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసిన నుంచి విజయసాయిరెడ్డి భాగస్వామి. ఇక మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా అంతే. అయితే ఈ ముగ్గురిలో షర్మిల, విజయసాయి ఇప్పుడు పార్టీలో లేరు. విజయమ్మ ఉన్నా లేనట్లేనని భావిస్తున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించడంతో విజయమ్మకు వైసీపీలో పెద్ద పాత్రలేదని చెప్పిసినట్లైంది. ఇక షర్మిల గొడవ నెక్ట్స్ లెవల్. ఇప్పుడు విజయసాయి నిష్క్రమణ కూడా చర్చనీయాంశమే. జగన్ అంటే అభిమానం అంటూనే ఆయన దేశంలో లేనప్పుడు తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
విజయసాయి రాజీనామాతో ఆ పార్టీకి మూలస్తంభాలుగా పనిచేసిన వారు ఎప్పుడో ఒకసారి ఇలా తప్పుకోవాల్సివస్తుందనే చర్చకు కారణమవుతోంది. వైసీపీ ఆవిర్భావంలో విజయసాయి, విజయమ్మ, షర్మిలతోపాటు విశాఖ జిల్లాకు చెందిన సబ్బం హరి, కొణతాల రామక్రిష్ణ పనిచేశారు. ఈ ఇద్దరూ 2014 ఎన్నికలకు ముందే ఆ పార్టీ నుంచి వైదొలగాల్సివచ్చింది. సబ్బం, కొణతాల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగ శిష్యులుగా చెబుతారు. ఆ సాన్నిహిత్యంతోనే వైసీపీలో చేరినా, ఎందుకో కొనసాగలేకపోయారు. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ తర్వాత అంతా ఈ ఇద్దరినీ గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇటీవల పార్టీ నుంచి తప్పుకున్న మరికొందరిపైనా చర్చ జరుగుతోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి మౌత్ పీసులుగా పనిచేసిన నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను గట్టిగా బలపరిచిన నేతలు కూడా ప్రస్తుత పరిణామాలతో రాజీ బాటలోనే నడుస్తున్నారు. ఇలాంటి వారికి పార్టీ నుంచి సరైన అండ లభించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సినీనటుడు పోశాని క్రిష్ణమురళి వంటివారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడాన్ని ఉదహరిస్తున్నారు. అదేవిధంగా మరో సినీ నటి శ్రీరెడ్డి సైతం ఇకపై వైసీపీ తరఫున మాట్లాడనని సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. ఇదివరకు వీరు వైసీపీకి బలమైన మద్దతుదారులు. కానీ ప్రస్తుతం తమకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని వైసీపీ అధిష్ఠానం సమీక్షించుకోవాలని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఒక్కొక్కరుగా తప్పుకుంటే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్నారు. సాధారణ కార్యకర్తలు, స్వార్థపూరిత నేతలు తప్పుకుంటే ఏదో అనుకోవచ్చనని, కానీ సాయిరెడ్డి వంటి బిగ్ హ్యాండ్ చేతులెత్తేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది.