విద్యా మంత్రి లోకేష్ సూపర్ ఆలోచన
లోకేష్ తనలోని ఉత్సాహన్ని కొత్త ఆలోచనలను కలగలిపి విద్యా శాఖలో మంచి సంస్కరణలను తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు.
విద్యా శాఖమంత్రిగా యువకుడు ఏపీకి రావడం ఒక విశేషం. అంతే కాదు విదేశాలలో అత్యున్నత చదువు చదివిన నారా లోకేష్ మానవ వనరుల శాఖను చేపట్టడం కూడా గ్రేట్ అనాలి. లోకేష్ తనలోని ఉత్సాహన్ని కొత్త ఆలోచనలను కలగలిపి విద్యా శాఖలో మంచి సంస్కరణలను తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగమే ప్రతీ వీకెండ్ అయిన శనివారం నో బ్యాగ్ డే విధానం. ఇది నిజంగా మంచి ఆలోచనగా చెప్పాలి. ఈ రోజులలో విద్యార్థులు అంటే కేజీల కొద్దీ బుక్స్ బరువుతో మోయలేని బ్యాగులతో కనిపిస్తారు. చదువు బుర్రలోకి ఎక్కడం అటుంచి మోకాలి చిప్పలు అరిగిపోతూ భుజాలు వంగిపోతూ బాల్యంలోనే బాధాకరమైన జీవితాన్ని మాత్రం ఈ కాలం విద్యార్థి అందుకుంటున్నాడు.
ఇక చూస్తే అన్నీ తరగతి గదులలోనే. పగలే వెన్నెల మాదిరిగా లైట్లు ఫ్యాన్లు వేసి అన్నీ బంధించి చెప్పే చదువులు విద్యార్ధిలోని చీకటిని తొలగించకపోగా చుట్టూ చీకటిని చేసి కట్టి పారేసే నేపథ్యం ఉంది. ఇక ఆట విడుపు లేదు, పాట విడుపు అంతకంటే లేదు, మానసిక ఎదుగుదల సైతం అంతకంటే లేదు. నిరంతరం రుబ్బుడు ప్రోగ్రాంతో విద్యార్ధి బంగారు భవితను నాలుగు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున వైనాలు దైన్యాలు కళ్ళ ముందు ఉన్నాయి.
ఈ పరిస్థితి మారాలని అంతా కోరుకుంటున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా శాఖ మీద చేసిన సమీక్షలో ఇక పైన ప్రతీ వీకెండ్ లోనూ నో బ్యాగ్ డే విధానాన్ని ప్రతీ స్కూల్ లో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతీ శనివారం ఈ విధానం అమలు చేస్తారు అన్న మాట. ఆ రోజున చదువుని కాస్తా పక్కన పెట్టేసి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పేరుతో విద్యార్ధికి మానసిక ఉల్లాసం కలిగించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
నిజానికి ఈ విధానం అమలు చేయాలని నిపుణులు కూడా అంటున్నారు. దానిని లోకేష్ చాలా దూర దృష్టిలో ఏపీలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో అమలు చేయడానికి నిర్ణయించడం మంచి పరిణామమని అంటున్నారు.
నో బ్యాగ్ డే రోజున టెక్నాలజీ సాయం తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్ధులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని లోకేష్ కోరారు. రేపటి పౌరులు అయిన పిల్లల మానసిక వికాసం కోసం కొత్త అభ్యాసాలను కూడా అలవరచుకునేలా కార్యాచరణ చేపట్టాలని ఆయన కోఅరారు. మొత్తానికి లోకేష్ తీసుకున్న నో బ్యాగ్ డే నిర్ణయం మాతం విద్యా వ్యవస్థలో మంచి మార్పునకు నాందిగా అంతా చూస్తున్నారు.