పవన్ డిమాండ్ : సనాతన్ పరిరక్షణ బోర్డుకు కేంద్రం ఓకేనా ?
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో ఈ డిమాండ్ వినిపించింది. మహా కుంభమేళ సాక్షిగా ఈ డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది.
అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం తిరుపతి లడ్డూల కల్తీ సందర్భంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కాపాడడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో వారాహి వాహనం మీద బహిరంగ సభను నిర్వహించి మరీ డిక్లరేషన్ విడుదల చేశారు.
అలా పవన్ నోటి వెంట తొలిసారిగా వచ్చిన ఈ డిమాండ్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగింది. అసలు ఇటువంటి బోర్డు ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. అదే సమయంలో ఆస్తిక జనులు హిందూత్వ వాదులు అంతా ఈ డిమాండ్ కి మద్దతుగా మాట్లాడితే మరికొన్ని వర్గాలు దీనిని విభేదించాయి.
ఈ క్రమంలో పవన్ మళ్ళీ ఈ టాపిక్ ని అయితే ఎత్తలేదు కానీ అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో ఈ డిమాండ్ వినిపించింది. మహా కుంభమేళ సాక్షిగా ఈ డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది.
దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని నాగ సాధువులు, సంతులు, అఖండాలతో కూడిన బృందం ఒకటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారరని అంటున్నారు. మహా కుంభమేళకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగా చర్చించారు
దాంతో వారు అంతా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దేశంలోని ఆలయాలు దేవుడి మాన్యాలు దేవాలయాలకు చెందిన ఆస్తులను ప్రభుత్వం పరిధి నుంచి తప్పించాలని వారు కోరారు.
అపుడే సనాతన ధర్మ పరిరక్షణ నిలుస్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో హిందూత్వవాదులకు అనుకూలంగా ఉండే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ తరహా డిమాండ్ రావడంతో దీనిని కేంద్రం అనుకూలంగా పరిశీలిస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ అన్నది ఈ రోజున అతి ముఖ్య అంశంగా హిందూత్వ వాదులు ముందుకు తెస్తున్నారు.
దాంతో పాటు హిందూ దేవాలయాల మీద రాజకీయ పెత్తనాన్ని నిరసిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఈ డిమాండ్ కి కేంద్రం కనుక మంచిగా స్పందించి ముందుకు అడుగులు వేస్తే ఏడున్నర పదులు దాటిన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అదొక కొత్త చరిత్రగానే ఉంటుంది అని అంటున్నారు. నిజంగా కేంద్రం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని నియమిస్తే కనుక జనసేన అధినేత పవన్ కి ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి కేంద్రం ఈ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తుందో.