వ్యవసాయమా..? మీడియా వ్యాపారమా...? విజయసారెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఆడవారి మాటలకు అర్థాలు వేరు అంటారు.. రాజకీయ నేతల మాటల్లోనూ నిజం కొంతే ఉంటుందని అంటారు.
ఆడవారి మాటలకు అర్థాలు వేరు అంటారు.. రాజకీయ నేతల మాటల్లోనూ నిజం కొంతే ఉంటుందని అంటారు. అందుకే వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాటలను ఎంతవరకు నమ్మొచ్చని ప్రశ్నిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. గతంలో పలుమార్లు మాట తప్పిన విజయసాయి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం తాత్కాలికమా? లేక నిజంగానే ఆయన అస్త్ర సన్యాసం చేస్తే నెక్ట్స్ ఏం చేస్తారు? అన్నది ఆసక్తి రేపుతోంది.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు 24న ప్రకటించారు విజయసాయిరెడ్డి. ముందుగా చెప్పినట్లే 25న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించారు. ఇక ఆయన లేఖ అందడమే ఆలస్యం అన్నట్లు ఆగమేఘాల మీద ఆమోద ముద్ర వేసి విజయసాయిని పదవీ విముక్తుడు చేశారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్. ఈ ఎపిసోడ్ అంతా ముందుగా చెప్పినట్లే జరిగినా, విశ్రాంతి జీవితంలో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు.
చార్టెడ్ అకౌంటెంటుగా చేయి తిరిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ సీఎం జగన్ కోసం రాజీలేని పోరాటం చేశారు. ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాల నుంచి వైదొలగిన విజయసాయిరెడ్డి మళ్లీ తన పాత వృత్తిని చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన గుర్తింపు రద్దు చేయాలని చార్టెడ్ అకౌంటెంట్ల సంఘం నిర్ణయించినా, హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు విజయసాయి. ఈ నేపథ్యంలో ఆయన మునుపటిలా తన వృత్తిని కొనసాగించడానికి చాన్స్ ఉన్నా, వ్యవసాయంతోనే విశ్రాంతి తీసుకుంటానని ఆయన చెప్పడం పట్ల విమర్శకులు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పాలిటిక్స్ కు రావాలంటే వ్యవసాయం అయితే వెంటనే ఎంట్రీ ఇవ్వొచ్చని, అదే చార్టెడ్ అకౌంటెంట్ అయితే అనుకున్న వెంటనే రాలేరనా? వ్యవసాయాన్ని ఆఫ్షనుగా ఎంచుకున్నట్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక గతంలో మీడియా రంగంలోకి వస్తానని స్వయంగా ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారా? అన్నది చర్చనీయాంశమవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా, పలుమార్లు సొంత పత్రిక, చానల్ ఏర్పాటు చేస్తానని హడావుడి చేశారు విజయసాయిరెడ్డి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి వ్యక్తిత్వంపై కొన్ని ఆరోపణలు వినిపించాయి. దేవాదాయశాఖ అధికారిణి శాంతి భర్త తీవ్ర ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి పరువును బజారుకీడ్చారు. దీనిపై వివరణ ఇచ్చే సందర్భంలోనూ తాను త్వరలో పత్రిక, టీవీ చానల్ ప్రారంభించనున్నట్లు విజయసాయి ప్రకటించారు.
చాలాకాలంగా మీడియా రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తున్న విజయసాయికి ఇప్పుడు తగిన సమయం వచ్చినట్లేనని పలువురు సూచిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పత్రిక పెట్టాలనే విజయసాయి ప్రయత్నాలకు ఆ పార్టీ అధినేత జగన్ అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ బంధం నుంచి విముక్తుడైన విజయసాయి స్వేచ్ఛగా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని అంటున్నారు. దీంతో రాజకీయాల నుంచి నిష్క్రమించిన మాజీ చార్టెడ్ అకౌంటెంట్ రూట్ ఎలా ఉండబోతోందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి చెప్పినట్లే వ్యవసాయం చేస్తారా? లేక మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారా? అన్నది చూడాల్సివుంది.