సచివాలయం ఉద్యోగాలు హుష్ కాకీ ?
ఏపీ ప్రభుత్వం గణతంత్ర వేడుకల వేళ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం చూస్తే మొత్తం లక్షా పాతిక వేల పై చిలుకు ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక్కసారిగా కుదించింది.
ఏపీ ప్రభుత్వం గణతంత్ర వేడుకల వేళ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం చూస్తే మొత్తం లక్షా పాతిక వేల పై చిలుకు ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక్కసారిగా కుదించింది. ప్రతీ రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి పది మంది దాకా ఉద్యోగులను అందులో నియమించింది నాటి వైసీపీ ప్రభుత్వం.
అది 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అమలులోకి వచ్చింది. సరిగ్గా అయిదేళ్ళకు మొత్తానికి మొత్తం సచివాలయాల స్ట్రక్చర్ నే మార్చబోతున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇపుడు అమలులోకి వచ్చింది.
దాంతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను కుదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జనాభా ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా నిర్ణయిస్తూ దానిని అమలు చేయనున్నారు. ఆ ప్రకారం చూస్తే ఇపుడు ఉన్న స్టాఫ్ ని మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్ఫిరేనల్ ఫంక్షనీర్లగా విభజించారు.
రెండున్నర వేల లోపు జనాభా కలిగిన సచివాలయానికి ఆరుగురు సిబ్బందిని నియమిస్తారు. దీనిని ఏ కేటగిరీలోకి చేర్చారు. ఇక బీ కేటగిరీలో మూడున్నర వేల లోపు జనాభా కలిగిన చోట సచివాలయం ఏర్పాటు చేస్తారు. అందులో ఏడు మంది సిబ్బంది పనిచేస్తారు. సీ కేటగిరీలో మూడున్నర వేల పై చిలుకు జనాభా కలిగిన చోట ఒక సచివాలయంగా ఉంచుతారు. అందులో ఎనిమిది మంది సిబ్బందిని నియమిస్తారు.
దీని ప్రకారం చూస్తే ఏకంగా నలభై నుంచి యాభై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఖాళీ అవుతారు. దాంతో వారి ఉద్యోగాలు పోయినట్లేనా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా సిబ్బందిని తగ్గించడంతో వేలాది మంది అవసరం లేకుండా పోతుంది. అదే సమయంలో ప్రతీ రెండు వేలంకూ కాకుండా అంతకు మించి పరిధిని ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులకు పనిభారం కూడా పెరుగుతుంది అని అంటున్నారు.
దీని మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభజన మీద పూర్తి స్పష్టతను వారు కోరుతున్నారు. తమ ఉద్యోగాలను ఉంచాలని అన్యాయం చేయవద్దని వారు వేడుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.