రాష్ట్రపతి నోట జమిలి ఎన్నికల మాట

అది కాస్తా 2024 ఎన్నికలకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నెతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం దాకా సాగింది.

Update: 2025-01-27 01:30 GMT

జమిలి ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం ఎంతటి పట్టుదల మీద ఉంది అన్నది అందరికీ తెలిసిందే. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జమిలి ఎన్నికల మీద కసరత్తులు చేస్తూనే ఉంది. అది కాస్తా 2024 ఎన్నికలకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నెతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం దాకా సాగింది. ఇక ఇపుడు చూస్తే జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబడింది.

దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. బహుశా ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ నాటికి జేపీసీ నివేదిక వెలువడనుంది అని భావిస్తున్నారు. అదే సమయంలో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం వ్యూహంగా ఉంది.

ఈ నేపధ్యంలో 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ జమిలి ఎన్నికల ద్వారానే దేశంలో సుపరిపాలన సాధ్యమని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

జమిలి ఎన్నికల వల్ల పాలనలో సుస్థిరత తో పాటు ఆర్ధిక భారాలు తగ్గించడం జరుగుతుందని అన్నారు. జమిలి ఎన్నికలు సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇస్తాయని ఆమె చెప్పారు. భారత్ లాంటి దేశాలకు జమిలి ఎన్నికల వల్ల ఎంతో మేలు జరుగుతుందని కూడా రాష్ట్రపతి చెప్పడం జరిగింది.

దీనిని బట్టి చూస్తూంటే జమిలి ఎన్నికల బిల్లు ఈ బడ్జెట్ సెషన్ లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందని అంటున్నారు. లోక్సభలో బీజేపీకి మెజారిటీ ఉంది. అయితే మూడింట రెండు వంతులు అంటే మరి కొన్ని పార్టీలను కలుపుకుని పోవాలి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం అక్కడ శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి ఎన్డీయేకు అనుకూల సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు పార్లమెంటులో ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అదే విధంగా చూస్తే కనుక రాజ్యసభలో అనేక పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇక వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలను తమ వైపునకు తిప్పుకునే ప్రక్రియ సాగుతోంది. ఇవన్నీ చూసుకున్నపుడు జమిలి ఎన్నికల గురించి రాష్ట్రపతితో కేంద్ర ప్రభుత్వం చెప్పించింది అంటే ప్రభుత్వ ప్రయారిటీలలో అది ముందు వరసలో ఉందని అంటున్నారు.

మొత్తానికి జమిలి ఎన్నికల బిల్లు ఈ సెషన్ లో ఆమోదం పొందితే ఆ మీదట చాలా కసరత్తు కూడా ఉంది అని అంటున్నారు. 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించినపుడు అయిన జమిలి విధానం ప్రవేశపెట్టాలీ అంటే ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందేలా చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News