వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు క్యాడర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.

Update: 2025-01-27 03:55 GMT

అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు క్యాడర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో అనేకమైన అంశాలను ప్రస్తావించారు. ప్రియమైన జనసైనికులు వీర మహిళలు, నాయకులకు హృదయ పూర్వకమైన నమస్కారాలు అంటూ ఈ బహిరంగ లేఖను ప్రారంభించిన పవన్ అనేకమైన కీలక అంశాలను అందులో పేర్కొన్నారు.


రాజకీయాలు తాను పదవుల కోసం చేయడం లేదు అన్నది పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలకు చారిత్రాత్మకమైన విజయం ప్రజలు అందించారు అని పవన్ గుర్తు చేశారు. వైసీపీ పాలకులు అయిదేళ్ళ పాటు సాగించిన విధ్వంసకరమైన పాలనకు అవినీతి అక్రమాలకు గాడి తప్పిన శాంతి భద్రతల మీద విసిగి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు.

ఏపీని అభివృద్ధికి తావు లేకుండా చేశారని అప్పుల పాలు చేశారని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రజలు కూటమి మీద పూర్తి విశ్వాసం ఉంచి 94 శాతం విజయంతో 175 సీట్లకు గానూ 164 సీట్లు కట్టబెట్టారని అన్నారు. జనసేన పార్టీకి అయితే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 సీట్లకు 21 ని గెలిపించారని అన్నారు.

ప్రజలు ఇచ్చిన ఈ అపూర్వమైన తీర్పుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సాగిస్తూ కూటమి పాలన ముందుకు సాగుతోంది అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన ఎనిమిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు దాకా ఏపీకి వచ్చాయని అన్నారు.

మారుమూల గ్రామాలలో సైతం మౌలిక సదుపాయాలతో పాటు రోడ్ల నిర్మాణం పనులు సాగుతునాయని తెలిపారు. అయిదు కోట్ల ప్రజానీకం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని యువతకు మంచి భవిష్యత్తు అందించాలని ఆలోచిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

ఈ నేపధ్యంలో కూటమిలోని మూడు పార్టీల నేతలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తల మీద ప్రచారం వద్దు అని అంతర్గత విషయాలు బహిర్గతం చేస్తూ చర్చలు పెట్టవద్దని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను కోరారు.

తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని భవిష్యత్తులోనూ చేసేది ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాకు తెలిసింది ప్రజల కష్టాలను కన్నీళ్ళను లేకుండా చేయడమే అన్నారు. అలాగే తాను పుట్టిన నేలకు న్యాయం చేయాల్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నాను అన్నారు.

ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని పవన్ కోరారు. ఇక మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ మొత్తం భవిష్యత్తు కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కోరారు. మొత్తానికి జనసేన నేతలకు పవన్ ఒక సందేశం అయితే పంపించారు. ఇదిపుడు వైరల్ అవుతోంది.

Tags:    

Similar News