సినీ తారలతో కమల విలాసం
కేంద్రంలో అధికారంలో గత పదేళ్ళుగా ఉన్న బీజేపీ సినీ తారల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.
కేంద్రంలో అధికారంలో గత పదేళ్ళుగా ఉన్న బీజేపీ సినీ తారల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి అర్హత ఉన్నా అవార్డులు దక్కకపోవడాన్ని గమనిస్తూ వాటిని సరైన సమయంలో అందజేయడం ద్వారా తారల అభిమానాన్ని పొందుతోంది.
తమిళనాడులో చూస్తే రజనీకాంత్ కి పద్మ విభూషణ్ 2017లో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ప్రకటినించి. గత ఏడాది మరణించిన తమిళనాడు స్టార్ డీఎండీకే పార్టీ ప్రెసిడెంట్ అయిన విజయ్ కాంత్ కి మరణాంతరం పద్మభూషణ్ ని ప్రకటించింది. ఆయనకు ప్రత్యేకంగా అభిమానం గణం ఉంది. అలాగే ఆయన పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది. దాంతో బీజేపీ ఆయన అభిమానులను తిప్పుకునే ఎత్తుగడగా ఇలా చేసింది అని అంటున్నారు
ఇక ఇపుడు చూస్తే తమిళ స్టార్ అజిత్ కుమార్ కి పద్మ భూషణ్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. ఆయన మూడు దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా తమిళనాడులో ఉన్నారు. ఆయన 1991లో ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమా ద్వారానే వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది.
దాంతో దీని మీద అక్కడ మరో సూపర్ స్టార్ కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న విజయ్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతారు. తమ హీరో రాజకీయాల్లోకి వస్తున్న వేళ తోటి స్టార్ కి పురస్కారం ఇవ్వడం రాజకీయమేనని వారు అంటున్నారు. అజిత్ విషయానికి వస్తే ఆయనకు రాజకీయ వాసనలు లేవు. కానీ ఆయనను అన్నాడీఎంకే పార్టీ వారు ఎక్కువగా అభిమానిస్తారు అని చెబుతారు.
తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో విజయ్ ఫ్యాన్స్ వైపు నుంచి ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఏపీలో చూస్తే 2024 ఎన్నికలకు ముందు మెగాస్టార్ కి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలుగా అర్హుడే అయినా బీజేపీ పెద్దలు ఆయనకు తమ వైపు తిప్పుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు అని ప్రచారంలో ఉంది.
ఇపుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆయనకు అవార్డు దక్కడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాలక్రిష్ణ నివాసానికి స్వయంగా వెళ్ళి ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం దక్కినందుకు అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు.
మరో వైపు మెగాస్టార్ చిరంజీవితోనూ కిషన్ రెడ్డి మంచి సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇపుడు బాలయ్యతోనూ ఆయన భేటీ వేశారు. దీంతో సినీ తారలతో కమల విలాసానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.