వైసీపీ బస్సు యాత్ర వల్ల ఏమీ లాభం లేదా...?

వైసీపీ సామాజిక బస్సు యాత్ర పేరుతో ఏపీలో మూడు రీజియన్స్ లో ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున యాత్ర చేపడుతోంది

Update: 2023-10-25 10:52 GMT

వైసీపీ సామాజిక బస్సు యాత్ర పేరుతో ఏపీలో మూడు రీజియన్స్ లో ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున యాత్ర చేపడుతోంది. మొత్తం అరవై రోజుల పాటు సాగే ఈ యాత్రలో టోటల్ గా ఏపీలో ఉన్న 175 సీట్లను టచ్ చేస్తూ సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలోనూ సభలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీ ప్రజా ప్రతినిధులను అందరినీ స్పీకర్లుగా ముందు పెట్టి వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగున్నరేళ్ళ కాలంలో ఆయా వర్గాలకు చేసిన మేలు ఏంటి అన్నది చాటి చెబుతారు.

ఈ సామాజిక బస్సు యాత్రతోనే వైసీపీ యాక్షన్ ప్లాన్ లో 2023 క్యాలండర్ ఇయర్ ముగియనుంది. ఒక విధంగా ఎన్నికలు సమీపంలోకి వచ్చిన వేళ వైసీపీ తనదైన ఆయుధంగానే ఈ సామాజిక బస్సు యాత్రను జనంలోకి తీసుకెళ్తోంది. దీని ద్వారా ఆయన వర్గాలని తిరిగి తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది.

అయితే ఈ సామాజిక బస్సు యాత్ర ఎంతవరకూ ప్రయోజనం అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తలనొప్పికి మందు రాయాలి కానీ కాలికి రాస్తే ఎలా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయట. వైసీపీ బస్సు యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళే ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు.

ముందుగా తమ పార్టీ క్యాడర్ ఎలా ఉందో వారి ఆంతరంగాన్ని తెలుసుకోవాలి కదా అని కూడా అంటున్నారు వైసీపీ 2019లో అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్యాడర్ ని ఈ కాలంలో విస్మరించారు. దాంతో వారిలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది అని అంటున్నారు. అలాంటి వారిని ముందుగా పట్టించుకోవాలి కదా అన్న చర్చ వస్తోంది.

అదే విధంగా చూస్తే సంక్షేమ పధకాలను చూపించి ఓట్లు అడగడం అన్నది వైసీపీ మార్క్ రాజకీయ ఎత్తుగడ అనుకున్నా ఎక్కడైనా పధకలను బడ్జెట్ బట్టి మాత్రమే ఇస్తారు కదా అని అంటున్నారు. అలా కేవలం పధకాలను బట్టి మాత్రమే ఓట్లు వేస్తే ఎక్కడైనా పార్టీ ఎందుకు క్యాడర్ ఎందుకు బూత్ లెవెల్ దాకా కమిటీలు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎంతటి బంగారానికి అయినా గోడ చాటు ఉండాలని అని అంటారు. అలా ప్రభుత్వం ఎంత చేసినా ఎన్ని పధకాలు ఇచ్చినా కూడా వాటిని జనంలోకి తీసుకుపోయి ప్రచారం చేసేది చివరికి ఎన్నికల వేళ నాటికి బూత్ ల దాకా ఆయన లబ్దిదారులను తీసుకుని వచ్చి ఓటేయించాల్సింది క్యాడర్ మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. బస్సు యాత్రలు సభలు సమావేశాలు వంటివి పై పై పూతలుగానే ఉంటాయి తప్ప గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పటిష్టగకు ఎంత మేరకు ఉపయోగపడాయన్నది క్యాడర్ నుంచి వస్తున్న కీలకమైన ప్రశ్న.

క్యాడర్ అన్న వారే పార్టీకి జెండా లాంటి వారు. వారే అజెండాను జనంలోకి తీసుకెళ్తారు. వైసీపీకి అలాంటి క్యాడర్ దండిగా నిండుగా ఉన్నారు. వారి సేవలను ఉపయోగైంచుకోవాలి అంటే వారిని ముందు కదిలించాలి. వారిని కార్యోన్ముఖులను చేయాలి. వారిని చైతన్యం చేయాలి. అంటే వారి మనసులో ఏముందో తెలుసుకుని పూర్వం మాదిరిగా వారిని ఆయుధాలుగా చేసుకోవాలి అన్న మాట వినిపిస్తోంది.

అలా కాకుండా బస్సు యాత్ర తరహా కార్యక్రమాలను పెడితే ఎంత మేరకు ఉపయోగపడతాయని అంటున్నారు. ఇక జనాలకు జగన్ కావాలి. ఆయన్ని చూసి ఓట్లు వేస్తారు. అంటే జగన్ కి ప్రజలకు మధ్యన అసలైన కనెక్షన్ గా క్యాడర్ ఉంది అని అంటున్నారు. అలా కాకుండా మంత్రులను ఎమ్మెల్యేలను చూసి ఎందుకు ఓట్లు వేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీని జనంలోకి తీసుకువెళ్లేలా క్యాడర్ ని రెడీ చేసి పెట్టుకుంటే వారే కాగల కార్యం తీరుస్తారు అని అంటున్నారు. ఇక బస్సు యాత్రలు అయినా మొరొకటి అయినా ఒక రోజు ఊరిలోకి నేతలు వచ్చి వెళ్లిపోతారే తప్ప ఎల్లపుడూ ఉండేది క్యాడరే కదా అన్న పరమ సత్యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అందువల్ల వైసీపీ వై నాట్ 175 అన్న బలమైన స్లోగన్ ని నిజం చేసుకోవాలీ అంటే క్యాడర్ ఆవేదనను అర్ధం చేసుకోవాలని అంటున్నారు. వారిని దగ్గరకు చేర్చుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News