మ్యానిఫెస్టోకి ముహూర్తం రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో విడుదలకు జగన్మోహన్ రెడ్డి ముహూర్తం రెడీ చేసుకున్నట్లు సమాచారం

Update: 2024-02-11 06:42 GMT

రాబోయే ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో విడుదలకు జగన్మోహన్ రెడ్డి ముహూర్తం రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 15వ తేదీ నుండి జిల్లాల పర్యటన జోరు పెంచబోతున్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. కుప్పం, రాయచోటి, రాప్తాడు, కర్నూలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడు బహిరంగసభలోనే పార్టీ తరపున మ్యానిఫెస్టో రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారట. అందుకనే రాప్తాడు బహిరంగసభను చాలా ప్రిస్టేజిగా తీసుకున్నారు.

పోయిన ఎన్నికల్లో 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైసీపీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో మొత్తం 52 నియోజకవర్గాలనూ వైసీపీయే గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలపైన ప్రత్యేక దృష్టిపెట్టారు. సర్వేలు చేయించుకుంటు అవసరమైన నియోజకవర్గాల్లో ఎంఎల్ఏ అభ్యర్ధులను మార్చేస్తున్నారు. మరికొంతమంది ఎంఎల్ఏలను నియోజకవర్గాలు మారుస్తున్నారు. 16వ తేదీన కుప్పంలో బహిరంగసభ జరగబోతోంది. అక్కడ వైఎస్సార్ చేయూతలో భాగంగా నిధులను విడుదల చేయబోతున్నారు.

21వ తేదీన కడప జిల్లాలోని రాయచోటి బహిరంగసభలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడి నిధులను రైతుల ఖాతాలో జమచేయబోతున్నారు. 24వ తేదీన కర్నూలు బహిరంగసభలో ఈబీసీ నేస్తం మూడోవిడత నిధులను ఖాతాల్లో జమచేయబోతున్నారు. 27వ తేదీన రాజధాని అమరావతి జిల్లా గుంటూరులో విద్యాదీవెన నాలుగో విడత నిధులను విద్యార్ధుల ఖాతాల్లో జమచేయబోతున్నారు. అలాగే మార్చి 5వ తేదీన అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి బహిరంగసభలో వసతి దీవెన రెండోవిడత నిధులను విద్యార్ధులకు అందిచబోతున్నారు.

రాయలసీమ జిల్లాల్లోని ఒక్క వేదిక నుండి రైతులు, మహిళలు, విద్యార్ధులకు అందించే నిధులను వాళ్ళ ఖాతాల్లో జగన్ జమచేయబోతున్నారు. ఈ సందర్భంగానే నాలుగు భారీ బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. బహిరంగసభల ద్వారా మొత్తం రాయలసీమను కవర్ చేసినట్లవుతుంది. ఇందులో భాగంగానే రాప్తాడులో మ్యానిఫెస్టో విడుదలకు ప్రత్యేకంగా భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. 175 సీట్లూ గెలవటానికి జగన్ తనదైన ప్రణాళికను రెడీచేసుకుంటున్నారు. అయితే జనాలు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది సస్పెన్సుగా మారింది.

Tags:    

Similar News