లవ్ లెటర్ వర్కవుటైతే హనీమూనే... లోకేష్ పై పేర్ని నాని పంచులు పీక్స్!

జైల్లో చంద్రబాబు - ఢిల్లీలో చినబాబు.. పవన్ కల్యాణ్ పడుతున్న కష్టం మొదలైన విషయాలపై తాజాగా స్పందించారు మాజీమంత్రి పేర్ని నాని.

Update: 2023-10-01 18:27 GMT

శనివారం రాత్రి టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన "మోత మోగిద్దాం" కార్యక్రమంతో పాటు.. జైల్లో చంద్రబాబు - ఢిల్లీలో చినబాబు.. పవన్ కల్యాణ్ పడుతున్న కష్టం మొదలైన విషయాలపై తాజాగా స్పందించారు మాజీమంత్రి పేర్ని నాని. ఇదే సమయంలో బాబు అరెస్ట్ పై స్పందించిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు పేర్ని నాని.

అవును... తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని.. చంద్రబాబు ప్రిపేర్ అయిపోవాలని సూచించారు. దోచుకున్న సొమ్ము తిరిగి ప్రజల ఖజానాకు ఇచ్చేస్తే దేవుడు క్షమిస్తాడని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా "మోత మోగిద్దాం" పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు పేర్ని నాని.

గతంలో కాపులను బీసీలలో చేర్చుతామని మాట ఇచ్చి, తప్పిన అనంతరం మొదలైన కాపు ఉద్యమంలో భాగంగా.. కాపుల ఆకలి కేకలు వినిపిస్తూ కంచాలపై గరిటెలతో కొట్టాలని ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపును గుర్తుచేశారు. నాడు అలా నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టిన బాబు... ఇప్పుడు ప్రజల సొమ్ము దోచేసి జైల్లో ఉన్న తనకోసం కంచాలు మోగించాలి, గంటలు కొట్టాలి, విజిల్స్ వేయాలి అని అడగడం ఏమిటని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో కంచాలు మోగించే కార్యక్రమంలో ఎవరికీ చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే బాద లేదని... రాత్రి డప్పులు కొట్టి, డమరుకం మోగించిన వారి కళ్లల్లో.. చంద్రబాబు అరెస్టయ్యారనే బాధ ఎక్కడా కనిపించలేదని అన్నారు. కెమెరాలకోసం ఒకనిమిషం నవ్వుతూ విజిల్స్ వేస్తూ, డప్పులు కొట్టారని.. ఆ విషయాలన్నీ ప్రజలు టీవీల్లో చూశారని అన్నారు.

ఇలాంటి సూక్షమైన విషయాలనే ప్రజలు గ్రహించగలుగుతున్నప్పుడు... 2014ఎన్నికల సమయంలో చంద్రబాబు, మోడీల కోసం పవన్ ఏమి చేశాడు, ఏమి మాట్లాడాడు... 2019 ఎన్నికల సమయంలో ఎలాంటి విమర్శలు చేశాడు... మరళా ఇప్పుడు చంద్రబాబుని ఎలా వెనకేసుకొస్తున్నారనే బహిరంగ విషయాలను ప్రజలు మరింతగా పరిశీలిస్తున్నారని.. ప్రజలకు అంతా తెలుసని.. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారనే విషయం గ్రహిస్తున్నారని అన్నారు.

టీడీపీ నేతలు చెబుతున్నట్లు ఆ పార్టీకి నిజంగా కోటిమంది కేడర్ ఉంటే... వాళ్లంతా బాబు కోసం వచ్చి ఉంటే... హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ఉన్నట్లుగా జనసందోహం ఉండేదని.. కానీ, చంద్రబాబు తమ సొమ్ము తినేశాడనే విషయం జనంతోపాటు టీడీపీ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఎవరూ బయటకు రావడం లేదని తెలిపారు.

ఇక “జగన్ మోహన్ రెడ్డికి భయం ఏమిటో చూపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు” అని చెప్పిన చినబాబు మాటలు విని ఆ పార్టీ కార్యకర్తలు చాలా ఊహించుకున్నారని.. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా చేర్చగానే బెయిల్ కి అప్లై చేసుకుని ఢిల్లీ పారిపోయారని అనారు. దీంతో జగన్ కి భయం పరిచయం చేయడమేమో కానీ... లోకేష్ ని మాత్రం జగన్ వణికించేస్తున్నాడని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులను లోకేష్ లవ్ లెటర్ తో పోల్చడంపైనా పేర్ని నాని స్పందించారు. లవ్ లెటర్ అనంతరం 4వ తేదీన డేటింగ్ జరుగుతుందని.. అది వర్కవుట్ అయితే వెడ్ లాక్ ఉంటుందని.. ఇక ఆ తర్వాత హనీమూనే అని.. ఆ విషయం లోకేష్ కి తెలిసే ఉంటుందని పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఇదే క్రమంలో... చంద్రబాబుని ఈ వయసులో అరెస్ట్ చేయడం దారుణం అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్ల పైనా పేర్ని స్పందించారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు, కేసీఆర్ అల్లుడు హరీశ్ లు మామలను గిల్లడం కోసం చూస్తున్నారని అన్నారు. అయితే ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి దెబ్బతిన్నారని.. కేసీఆర్ గజ ముదురు కాబట్టి హరీశ్ కి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చని అన్నారు.

Tags:    

Similar News