కుంభమేళాకు ఎలాన్ మస్క్ కు ఆహ్వానం.. రియాక్షన్ ఇదే
ఈ మహా కుంభమేళాకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయాల్లో ఒకటి కుంభమేళా. రోజుకు కోట్లాది మంది వస్తున్న ఈ అధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రానున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ఆయన్ను కలిసి.. కుంభమేళాకు రావాలంటూ ఆహ్వానించిన ప్రముఖ వ్యాపారవేత్త మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ మహా కుంభమేళాకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు ఆహ్వానం అందింది.
టెక్సాస్ లో భారత బిజినెస్ లీడర్లతో సమావేశమైన సందర్భంగా ఎలాన్ మస్క్ కు మహాకుంభమేళాకు హాజరు కావాలంటూ ఆహ్వానాన్ని అందించిన విషయాన్ని ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మస్క్ ను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్త రితేష్ అగర్వాల్ సైతం తన అనుభవాల్ని వెల్లడించారు.
మహా కుంభమేళాకు ఎలాన్ మస్క్ వస్తారని తాను ఆశిస్తున్నట్లుగా ఆయన ఆశాభావాన్నివ్యక్తం చేస్తున్నారు. మహా కుంభమేళా గురించి మస్క్ చాలా ఉత్సాహంగా ఉన్నారన్న రితేష్.. ‘ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా భారత దేశం గురించి మస్క్ మాట్లాడారు. ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో భారత్ ఒకటిగా పేర్కొన్నారు. అక్కడెంతో వైవిధ్యం ఎంతో ఉంది. భారతదేశం.. అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఉంటే.. ఆర్థిక వ్యవస్తకు మరింత ఉత్సాహం వస్తుందని మస్క్ తెలిపారు’’ అని వెల్లడించారు.
మస్క్ తో జరిగిన సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగినట్లు చెప్పారు. రితీష్ చెప్పినట్లుగా మహాకుంభమేళాకు ఎలాన్ మస్క్ కానీ హాజరైతే యావత్ ప్రపంచం మరోసారి భారత్ వైపు.. ఈ మతపరమైన కార్యక్రమం వైపు చూస్తుందనటంలో సందేహం లేదు. ఇప్పటికే యాపిల్ వ్యవస్థాపకుడు స్వర్గీయ స్టీవ్ జాబ్స్ సతీమణి హాజరు కావటం.. ఆమె తన పేరును కమలాగా మార్చుకొని క్రతువులు నిర్వహించటం తెలిసిందే. ఫిబ్రవరి 26 (శివరాత్రి)న మహా కుంభమేళా ముగియనుంది. ఆ లోపు మస్క్ ఎప్పుడు వస్తారో చూడాలి.