వంగవీటి రాధా, ముద్రగడలకు వైసీపీ ఆఫర్‌ చేస్తున్న సీట్లివే!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది

Update: 2024-01-02 05:26 GMT

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపు సామాజికవర్గంలో అత్యధిక భాగం కూటమి వైపు వెళ్లే ప్రమాదం కనిపిస్తుండటంతో నష్టనివారణ చర్యలు చేపట్టిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించిందని చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికే చెందిన అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేస్తున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తారని గట్టి ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకుని గతంలో విమర్శలు చేయడం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి మద్దతుగా మాట్లాడటం వంటి చర్యల ద్వారా ముద్రగడ పద్మనాభం తన రూటు ఎటో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు.

అయితే ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో రెండు పదవులు కోరుతున్నారని తెలుస్తోంది. తనను రాజ్యసభకు పంపాలని, అలాగే తన కుమారుడికి ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. అయితే వైసీపీ అధినేత జగన్‌.. కుటుంబంలో ఎవరికైనా ఒకరికే సీటు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ముద్రగడకు లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీటు, లేదా ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు ఇస్తానని చెప్పినట్టు సమాచారం.

ఇక 2019 ఎన్నికల ముందు తాను అడిగిన విజయవాడ సెంట్రల్‌ సీటును ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు.

ఇప్పుడు వంగవీటి రాధాను కూడా వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌ తరఫున రాధాతో మాట్లాడారని చెబుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్‌ సీటుతోపాటు ఆయన సోదరి ఆషాకు ఏలూరు లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అవకాశమిస్తామని ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా పెద్ద ఎత్తున కాపు నేతలను వైసీపీలో చేర్చుకుని పవన్‌ ను దెబ్బకొట్టాలనేదే జగన్‌ వ్యూహమని అంటున్నారు.

మరి వైసీపీ అధినేత జగన్‌ ఇచ్చిన ఆఫర్‌ కు వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News