షర్మిల పార్టీ విలీనం ?

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

Update: 2023-09-16 04:25 GMT

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారికంగా రెండుపార్టీల నుండి ఇప్పటివరకు సమాచారం అయితే లేదు. అయితే 16, 17 తేదీల్లోనే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధి, రాహుల్ , ప్రియాంక గాంధీలతో పాటు అనేక మంది కాంగ్రెస్ ప్రముఖ నేతలు హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు. ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది. 17వ తేదీన తుక్కుగూడలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు.

సో, సీడబ్య్లూసీ సమావేశం అయిన వెంటనే లేదా బహిరంగసభ సందర్భంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు సమాచారం. సోనియా, రాహూల్, ప్రియాంకలు కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇంతమంది ప్రముఖల మధ్య తాను కాంగ్రెస్ లో చేరటానికి షర్మిల నిర్ణయించుకున్నారట. మొత్తానికి చాలా నెలలుగా నలుగుతున్న ఒక ముఖ్యమైన అంశానికి రెండు రోజుల్లో ముగింపు పడబోతోంది.

షర్మిల రాజకీయ భవిష్యత్తుకు సోనియా తగిన హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేయాలని షర్మిల ఒకప్పుడు అనుకున్నారు. అయితే తాజా పరిణామాల్లో అక్కడ పోటీనుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరబోతున్న తుమ్మల నాగేశ్వరరావుకు త్యాగం చేసినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరకుండానే షర్మిల త్యాగాలకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. మరి సికింద్రాబాద్ పార్లమెంటు నుండి పోటీచేస్తారా లేకపోతే అసలు పోటీకే దూరంగా ఉంటారా అన్నది కూడా సస్పెన్సుగానే ఉంది.

ఏదేమైనా రాబోయే తెలంగాణా ఎన్నికల్లో షర్మిల సేవలను స్టార్ క్యాపెయినర్ హోదాలో రాష్ట్రమంతా ఉపయోగించుకోవాలని సోనియా డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. స్టార్ క్యాంపెయినర్ హోదా అంటే షర్మిల ఎక్కడా పోటీకి దిగటంలేదనే అనుకోవాలి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా జరిగితే షర్మిల విషయంలో కాస్త క్లారిటి వస్తుంది. అదే జమిలి ఎన్నికలు జరిగితే అప్పుడు షర్మిల ఏమిచేస్తారు ? అన్నదే ఆసక్తిగా మారింది. అయితే కర్నాటక నుండి రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ప్రచారం ఎలాగు ఉండనే ఉంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News