కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి కౌంట్ డౌన్ స్టార్ట్...?

ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది.

Update: 2023-08-08 13:35 GMT

ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు తెలియచేస్తూ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె మద్దతు ప్రకటించారు.

ఈ రోజున దేశానికి ప్రజాస్వామ్య పునాదులకు ముప్పు వాటిల్లుతున్న నేపధ్యంలో ఇది అనివార్యం అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెంగళూరుకి వెళ్ళిన షర్మిల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ తో భేటీ అయి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలసి మంగళవారం రాత్రి కానీ బుధవారం కానీ ఢిల్లీ చేరుకుంటారని అంటున్నారు.

షర్మిల పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసే వ్యవహారంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ విషయంలో సంధానకర్తగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఢిల్లీలో డీకే కలసి ఆమె సోనియా గాంధీని కలుస్తారు అని తెలుస్తోంది. అక్కడే షర్మిల పార్టీ విలీన ప్రక్రియ తుది రూపు తీసుకుంటుంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం అంటే ఇక లాంచనం అని అంటున్నారు. కాంగ్రెస్ కి రెండు తెలుగు రాష్ట్రాల మీద చూపు ఉంది. దాంతో షర్మిల తన పార్టీని విలీనం చేస్తే ఆమెను ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో చురుకుగా వాడుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తారని అంటున్నారు.

అదే విధంగా 2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆమె పేరు ప్రకటిస్తారని అంటునారు. వైఎస్సార్ వారసత్వం మొత్తం వైఎస్ జగన్ కే పోకుండా కాంగ్రెస్ కూడా తన వాటాను తెచ్చుకోవడానికే షర్మిలను తీసుకుంటారని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ చెదిరిపోయింది. పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపుగా పోయింది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గట్టిగానే చేయాలని చూస్తోంది. అందుకే షర్మిలను పార్టీలోకి చేర్చుకుని మొదట తెలంగాణా ఎన్నికల కోసం ప్రచారం వరకూ వాడుకుంటారని, ఆ మీదట ఏపీలో పూర్తి స్థాయిలో షర్మిల సేవలను తీసుకుంటారని అంటున్నారు

షర్మిల సైతం తెలుగు రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఒకనాటి తండ్రి పార్టీ, తాము ఎదిరించిన కాంగ్రెస్ వైపే ఆమె మొగ్గు చూపుతున్నరని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల భోగట్టాగా ప్రచారంలో అయితే ఉంది.

Tags:    

Similar News