“Blood is thicker than Water”... విజయమ్మ సంచలన లేఖ!

గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు.

Update: 2024-10-29 14:31 GMT

గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ లేఖ రాశారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... జగన్ - షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వ్యవహారం తీవ్రమవుతున్న నేపథ్యంలో.. నాలుగు గోడల మధ్య వ్యవహారం బజారుకు వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో... వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె లేఖలో పేర్కొన్న విషయాలను ఇప్పుడు చూద్దామ్.!

ఇందులో భాగంగా... "రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతీ హృదయానికీ, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతీ ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన" అని మొదలైన ఈ లేఖలో... ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాదేతుందని.. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్ధం కావడం లేదని అన్నారు.

నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అబంద్దాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు.

ఇవి కొనసాగకూడదు. నా పిల్లలిద్ధరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నాను.. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి మాట్లాడుతున్నవారందరికీ ఒకటే అడుగుతున్నాను!

రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యనుంచి వెళ్లిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఇది నేను ఎన్నటికీ మరిచిపోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు.. దూషణలు చేయవద్దు.. ఈ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు.. "బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్". వాళ్లు ఇద్దరూ సమాధాన పడతారు.

ఈ సమయంలో మీరెవరూ రెచ్చగొట్టొద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధాన కర్త. నా బిడ్డ సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.

ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇతరులు అందరూ.. వాళ్లు మాట్లాడుతున్నది వాళ్లు ప్రేమించే వైఎస్సార్ గురించి అని మరిచి, తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని సృహ లేకుండా, ఎన్నో అసత్యాలు చెప్పారు.

వైఎస్సార్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశరు అని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్సార్ గారు పిల్లలు ఇద్దరూ పెరుగుతున్న రోజుల నుంచీ కొన్ని ఆస్తులు పాప పేరు మీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు.. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంచడం కాదు.

విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవీ సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది.

వీరు ఇద్దరూ నా పిల్లలు. వీరిని నేను, వైఎస్సార్ గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాటా సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమే అన్నది నిజం.

నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్సార్ గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ.. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. బాధ్యతగల కొడుకుగా కుటుంబ ఆస్తులను జగన్ సంరక్షించాలి అన్నది కూడా నిజం.

రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత.. 2009 నుంచి 2019 వరకూ 10 ఏళ్లు కలిసే ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంవోయూ ప్రకారం జగన్ 60 శాతం, పాపకు 40 శాతం.

2019లో సీఎం అయిన తర్వాత... డివైడ్ అవ్వాలని ఇజ్రాయెల్ లో జగన్ ప్రపోజల్ పెట్టారు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు కాబట్టి విడిపోదాం అన్నాడు.

ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తులు ఇవి జగన్ కి, ఇవి పాపకు అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంవోయూనే ఈ ఎంవోయు. హక్కు ఉంది కాబట్టే పాపకి 200 కోట్లు ఇచ్చారు. అవి పాపకు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు.. బాధయ్తగా ఇస్తున్నవి.

షర్మిలమ్మను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్ధంగా కష్టపడింది. జగన్ అధికారంలోకి రావడానికి పాప ఎంతో కృషి చేసింది.

జన్మనిచ్చిన ప్రతీ తల్లితండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన్న ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం.

ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే అయినప్పటికీ... వాళ్లు ఇద్దరూ అన్నా చెల్లెళ్లు.. ఇది వాళ్లిద్దరి సమస్య.. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు.

Tags:    

Similar News