నావల్నీ, ప్రిగోజిన్ లా ఇతడినీ లేపేద్దాం.. రష్యా భారీ కుట్ర బద్దలు

ప్రపంచంలో ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ప్రాంతాలు ఏవంటే.. గాజా(పాలస్తీనా)-ఇజ్రాయెల్, తైవాన్-చైనా, ఉక్రెయిన్-రష్యా

Update: 2024-05-11 09:46 GMT

ప్రపంచంలో ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ప్రాంతాలు ఏవంటే.. గాజా(పాలస్తీనా)-ఇజ్రాయెల్, తైవాన్-చైనా, ఉక్రెయిన్-రష్యా. వీటిలో గాజా మరీ సంక్షుభితంగా మారుతోంది. తైవాన్ తో చైనాకు ఎప్పుడూ లడాయే. మిగిలింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం. దాదాపు 27 నెలలుగా సాగుతోంది ఈ రెండు దేశాల ఘర్షణ. వేలాది మంది ప్రాణాలు పోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇంకా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారం తీరలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన పట్టు వీడలేదు.

తమ శత్రువులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కనిపెట్టి మరీ లేపేయడం ఇజ్రాయెల్, రష్యాలకు మొదటినుంచి ఉన్న ‘ప్రావీణ్యం’. తనను వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని పుతిన్ ఎలా హింసించారో అందరికీ తెలిసిందే. చివరకు నావల్నీ జైల్లోనే ప్రాణాలొదిలాడు. తనపై తిరుగుబాటు చేసిన ప్రయివేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ అధిపతి, ఒకప్పటి తన చెఫ్ అయిన ప్రిగోజిన్ కు పుతిన్ ఎలాంటి గతి పట్టించారో అందరూ చూశారు. ప్రిగోజిన్ విమాన ప్రమాదానికి కారణం పుతిన్ అనేది చాలామంది చెప్పే మాట. ఇప్పుడు వీరిలానే జెలెన్ స్కీనీ లేపేద్దామని రష్యా కుట్ర పన్నినట్లు బయటపడింది. జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ కు చెందిన కొందరు సైనికాధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నాగం చేసిందని, దానిని తాము భగ్నం చేశామని ఉక్రెయిన్‌ ఇటీవల ప్రకటించింది.

బాడీ గార్డ్ చీఫ్ తో చంపేద్దాం..

జెలెన్ స్కీని ఆయన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీగార్డ్‌ చీఫ్‌) స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ అధిపతి సెర్గియ్‌ లియోనిడోవిచ్‌ రుడ్‌ ద్వారానే చంపాలని ప్లాన్ వేశారా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. దీంతో రుడ్ పై జెలెన్ స్కీ వేటు వేశారు. కారణాలు ఏమీ చెప్పకుండానే ఈ చర్యలు తీసుకున్నారు. అంతేగాక స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. జెలెన్ స్కీ హత్యకు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వీరి పాత్ర ఉన్నట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.

యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే..

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా.. తొలినాళ్లలోనే జెలెన్ స్కీని హతమార్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే, అవేవీ సఫలం కాలేదు. కాగా, పుతిన్ ప్రభుత్వం వాంటెడ్‌ జాబితాలో జెలెన్‌ స్కీ పేరుంది. ఏ నేరంపై ఇలా చేర్చారనేది తెలియదు. కొన్ని నెలల కిందటే ఇది జరిగినా.. ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News