ఢిల్లీ యుద్ధానికి చంద్రబాబు! బీజేపీ ఆసక్తికర వ్యూహం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, 3 వ తేదీతో ప్రచారం ముగుస్తోంది.

Update: 2025-01-31 17:30 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, 3 వ తేదీతో ప్రచారం ముగుస్తోంది. అంటే మరో మూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. వరుసగా గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆప్ హ్యాట్రిక్ పై కన్నేస్తే, ఈ సారి ఎలాగైనా విజయం అందుకోవాలని బీజేపీ వ్యూహం రెడీ చేసింది. ఇందుకు బీజేపీ అగ్రనేతలతోపాటు ఎన్డీఏ కూటమిలోని బడా నేతలను రంగంలోకి దింపుతోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీలో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు. బీజేపీ తర్వాత సీట్లు పరంగా టీడీపీయే పెద్దపార్టీ. అంతేకాకుండా చంద్రబాబు సహకారం ఉంటేనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. 2019లోనూ చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం దక్కుతున్న ప్రాధాన్యం వంద రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి విషయంలోనూ చంద్రబాబును భాగస్వామి చేస్తున్నారు. ఏపీలో ఆయన నాయకత్వంలో రికార్డు స్థాయి విక్టరీ కొట్టడం బీజేపీని ఆకర్షించింది. చంద్రబాబు విజన్ పై తెలుగు వాళ్లకు నమ్మకం పెట్టుకోవడంతోనే ఈ స్థాయి విజయం దక్కిందని బీజేపీ విశ్వసిస్తోంది. అందుకే ఢిల్లీ గడ్డపై చంద్రబాబుతో ప్రచారం చేయాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో తెలుగువారి ఓట్లు దాదాపు ఆరేడు లక్షలు ఉంటాయని అంటున్నారు.

దాదాపు 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు. అయితే చంద్రబాబు ప్రచారానికి సమయం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు ఆదివారం రోజంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడపనున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుందన చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది.

2024 ఎన్నికల్లో ఏపీలో రికార్డు విజయం సాధించిన చంద్రబాబును తన ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని బీజేపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. కొద్ది నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయాల్సివుంది. అయితే ఆ సమయంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు మరణంతో ఆ పర్యటన రద్దు అయింది. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన స్థానాలతోపాటు ఆ రాష్ట్రంలో దాదాపు మూడొంతులకు పైగా స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది బీజేపీ. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News