ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనిల్ అంబానీకి ఒక స్వీట్ న్యూస్

కొండలా ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకోవటం కోసం కిందా మీదా పడుతున్న అనిల్ అంబానీకి తాజాగా కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చేలా ఉందని చెప్పాలి.

Update: 2024-09-30 04:28 GMT

ఇద్దరు అన్నదమ్ములే. ఒకరేమో విజయానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటే..మరొకరు ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి మారారు. ఒకటి కాదు రెండు కాదు అదే పనిగా ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే రిలయన్స్ ఇన్ ఫ్రా అధినేత అనిల్ అంబానీకి ఒక భారీ ఊరట లభించింది. కొండలా ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకోవటం కోసం కిందా మీదా పడుతున్న అనిల్ అంబానీకి తాజాగా కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చేలా ఉందని చెప్పాలి.

పశ్చిమ బెంగాల్ కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పొట్టిగా చెప్పాలంటే డీవీసీ వివాదంలో రిలయన్స్ ఇన్ ఫ్రాకు అనుకూలంగా కోల్ కతా హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇదే విషయాన్ని రిలయన్స్ ఇన్ ఫ్రా పేర్కొంది. తాజా తీర్పుతో రిలయన్స్ కు రూ.780 కోట్లను డీవీసీ చెల్లించాల్సి ఉంటుంది. దాదాప దశాబ్దం క్రితం మొదలైన ఈ అంశంలోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ లోని పురూలియాలో 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ఫ్లాంట్ ను నెలకొల్పే ప్రాజెక్టును రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ను రూ.3750 కోట్లకు దక్కించుకుంది. కారణాలు ఏమైనా.. కొన్ని వివాదాల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. దీంతో.. డీవీపీ రిలయన్స్ ఇన్ ఫ్రా నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ కంపెనీ కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసుకు సంబంధించి 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. రిలయన్స్ ఇన్ ఫ్రాకు రూ.896 కోట్లు చెల్లించాలని పేర్కొంది. అయితే.. దీనిపై సదరు కంపెనీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మరోసారి పీటముడి పడినట్లైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోల్ కతా హైకోర్టు రిలయన్స్ వాదనను సమర్థిస్తూ తీర్పును ఇచ్చింది.దీంతో అనిల్ అంబానీకి భారీ ఊరట వచ్చినట్లైందని చెప్పాలి.

Tags:    

Similar News