వైఎస్ జగన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే.

Update: 2024-07-30 06:55 GMT

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గతంలో 151 సీట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసరై 11 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. దీంతో... అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు కోసం జగన్ పోరాటం చేస్తోన్నారు. అయితే నిబంధనల ప్రకారం అసెంబ్లీలో 10శాతం సీట్లు సాధిస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తామంటోంది ప్రభుత్వం!

మరోపక్క జగన్ మాత్రం... ఏపీ శాసనసభలో మరోపార్టీ లేకపోవడంతో తనను విపక్ష నేతగా గుర్తించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అయితే... ప్రభుత్వం మాత్రం 10శాతం సీట్ల నిబంధననే ప్రస్థావిస్తోంది. వైసీపీ మాత్రం అలాంటి నిబంధన ఏమీ లేదన్నట్లుగా వాదిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... తనను విపక్ష నేతగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు. గతంలో ఇలా 10శాతం సభ్యులు లేకపోయినా విపక్ష నేత హోదా పొందిన ఉదాహరణలను తన పిటిషన్ లో ప్రస్థావించారని అంటున్నారు. ఇందులో భాగంగా 1953 నాటి ఏపీ జీతభత్యాలు, అనర్హతల తొలగింపు చట్ట ప్రకారం 10శాతం సభ్యులుంటేనే విపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ లేదన్నారు!

1996లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో 26 సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీలో పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) కి విపక్ష నేత హోదా ఇచ్చారని.. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం 3 స్థానాలే ఉన్నా కూడా విపక్ష హోదా ఇచ్చారని.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలనీ జగన్ కొరారు! దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు (జూలై 30) కి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో జూలై 26 శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో... జగన్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని.. ఈఅంశంపై స్వయంగా వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ రోజుకి వాయిదా వేసింది. దీంతో... నేటి విచారణలో ఏమి జరగబోతుందనే ఆసక్తి నెలకొన్న వేళ, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవును... తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... ఏపీ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా... అసెంబ్లీ రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

ఇదే క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది!

Tags:    

Similar News