‘జగన్ కు సెక్యూరిటీ కుదించలేదు.. జెడ్ ప్లస్ కంటిన్యూ చేస్తున్నాం’
అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కల్పిస్తున్న భద్రత వివరాల్ని మరింత క్లియర్ గా కోర్టుకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాల్ని ఏపీ పోలీసు శాఖ కోర్టుకు తెలియజేసింది. నిబంధనలకు అనుగుణంగానే భద్రత కల్పిస్తున్నామని.. ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతోందని పేర్కొంది. జగన్ కు భద్రత తగ్గించామన్న వాదనలో నిజం లేదన్న ఏపీ పోలీస్ శాఖ.. అందుకు తగ్గట్లే కొన్ని గణంకాల్ని ఉటంకించింది.
తనకు కల్పిస్తున్న భద్రతను తగ్గించేశారని.. జూన్ 3 నాటికి తనకున్న భద్రతను కంటిన్యూ చేయాలంటూ హైకోర్టును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టుకు తాజాగా పోలీసు శాఖ తన వాదనను వినిపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నజగన్ కు అప్పట్లో కల్పించిన అదనపు భద్రతను మాత్రమే తగ్గించామని పేర్కొంది. ‘‘ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు సీఎంగా ఉన్నప్పుడు కల్పించిన భద్రతను ఇప్పుడు ఇవ్వటం సాధ్యం కాదు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత భద్రత కల్పించామో.. అంతే భద్రతను తాజాగా జగన్ కు అందిస్తున్నాం. సీఎం హోదాలో ఉన్నప్పుడు జగన్ కు కల్పించిన అదనపు భద్రతను మాత్రమే తగ్గించాం. ఇప్పటికి ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కంటిన్యూ అవుతోంది’’ అంటూ వివరణ ఇచ్చారు.
అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కల్పిస్తున్న భద్రత వివరాల్ని మరింత క్లియర్ గా కోర్టుకు వివరించారు. ప్రస్తుతం జగన్ కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని.. ఆయన ఇంటి వద్ద పది మంది సాయుధ గార్డులభద్రత ఉందని.. షిప్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్ వోలు 24 గంటల పాటు ఆయనకు భద్రత ఇస్తారని పేర్కొన్నారు. మొత్తం 24 మందితో కూడిన సిబ్బంది రెండు ఎస్కార్ట్ టీంలు నిరంతరం ఆయనతో ఉంటాయి.
పగలు.. రాత్రి కలిపి మొత్తంగా ఐదుగురు వాచర్లను ఏర్పాటు చేశామని.. ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారిని సెక్యూరిటీ ఇన్ చార్జిగా పెట్టామని చెప్పారు. అంతేకాక.. మూడు షిప్టుల్లో పని చేసేలా ఆరుగురు ఫ్రిష్కర్లు.. స్క్రీనర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్ కు కేటాయించామన్నారు. మొత్తంగా భద్రతాపరంగా మాజీ సీఎం జగన్ కు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు.